ఇండియా నుంచి విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నవారిలో భారతీయులే ఎక్కువని తేలింది. ప్రపంచ వ్యాప్తంగా ఇలా విదేశాల్లో స్థిరపడిన భారతీయుల సంఖ్య.. 18 మిలియన్ల వరకు ఉందని తెలుస్తోంది. ఆ తరువాత 11.2 మిలియన్లతో మెక్సికో, 10 మిలియన్ల చొప్పున రష్యా, చైనా ఉన్నాయని ఓ నివేదిక వెల్లడించింది. మెక్సికన్లలో చాలామంది అమెరికాలో స్థిర పడినా ..వారిలా కాకుండా భారతీయులు అమెరికాతో బాటు పలు ఇతర దేశాల్లో కూడా వ్యాప్తి చెందారు.
అరబ్ దేశాల్లో బ్లూ కాలర్ వర్కర్ల స్థాయి నుంచి ఇతర పారిశ్రామిక దేశాల్లో విద్యార్థుల వరకు అంతా ఇండియన్స్ ఉన్నారని ఈ రిపోర్టు పేర్కొంది. పాకిస్థాన్, బంగ్లాదేశ్ రెండు దేశాల కన్నా వీరి సంఖ్య అత్యధికం. 2020 లో కరోనా పాండమిక్ ఉన్నప్పటికీ 0. 7 మిలియన్లకు పైగా భారతీయులు ఇతర దేశాలకు వెళ్లారు. 2022 సంవత్సరానికి ఇది 1.3 మిలియన్లకు పెరిగింది. గల్ఫ్, తూర్పు ఆసియా దేశాలకు వెళ్లేందుకు అనేకమందికి ఈసీఆర్ పాస్ పోర్టులను అధికారులు జారీ చేశారట.
వీరిలో స్కూలు చదువు పూర్తి చేయనివారు కూడా ఉన్నారు. ప్రతి సంవత్సరం 0.1 మిలియన్లకు పైగా భారతీయులు తమ భారతీయ పౌరసత్వాన్ని వదులుకుని విదేశాల్లో స్థిరపడుతున్నారు.2011 నుంచి 1.6 మిలియన్ల మంది తాము స్థిర పడిన దేశాల పౌరసత్వం తీసుకున్నారట. 2021 లో ప్రవాస భారతీయుల నుంచి ఇండియాకు 89 బిలియన్ డాలర్ల విదేశీ మారక ద్రవ్యం అందిందని అంచనా. ఇండియా తరువాత మెక్సికో వాసులు తమ దేశానికి 54 బిలియన్ డాలర్లు, చైనీయులు తమ దేశానికి 53 బిలియన్ డాలర్లు పంపితే నైజీరియా వాసులు తమ దేశానికి 19 బిలియన్ డాలర్లు మాత్రం పంపారని ఈ నివేదిక వివరించింది.
వివిధ పనులు, ఉద్యోగాల కోసం, ఇతర వృతిగతమైన వాటి కోసం 2020 లో ఇండియా నుంచి విదేశాలకు 7.2 లక్షలమంది వెళ్తే.. 2021 లో ఇది 8.3 లక్షలకు, 2022 లో 13.0 లక్షలకు పెరుగుతూ వచ్చింది. భారతీయ మేధస్సుకు విదేశాలు అధిక ప్రాధాన్యమిస్తున్నాయని తెలుస్తోంది.
‘