విదేశీ ప్రయాణం అంటే ఖర్చుతో కూడుకున్న పని. వీసా, పాస్ పోర్టు, విమాన ఛార్జీలు ఇలా అన్నీ కలిపి ఖర్చు తడిసి మోపెడవుతుంది. దీంతో విదేశీ ప్రయాణాలంటే చాలా మంది ఒకటి రెండు సార్లు ఆలోచిస్తారు. ఖర్చు విషయంలో ఇక చేయి వెనక్కి గుంజుతారు. భారత్ లాంటి దేశాల్లోనైతే ఇక చెప్పాల్సిన పనేలేదు.
కానీ ఇటీవల భారతీయుల్లో ఆలోచనల్లో మార్పులు వస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి.
2022-23లో మొదటి తొమ్మిది నెలల్లో విదేశీ ప్రయాణాలపై భారతీయులు ఏకంగా పది బిలియన్ డాలర్లు ఖర్చు చేశారని ఆర్బీఐ నివేదిక చెబుతోంది. 2020 ఆర్థిక సంవత్సరంలో కొవిడ్ కు ముందు ఏ సంవత్సరంలోనూ భారతీయులు ఇంతగా ఖర్చు చేయలేదని పేర్కొంది.
ఆర్బీఐ నివేదిక ప్రకారం… విదేశీ పర్యటనలపై మనవాళ్లు గతేడాది డిసెంబర్ ఒక్క నెలలోనే 1137 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. గతేడాది ఏప్రిల్- డిసెంబర్ మధ్య ఈ ఖర్చు 9,947 మిలియన్ డాలర్లుగా ఉంది.
విద్య, బంధువుల నిర్వహణ ఖర్చులు, బహుమతులు, పెట్టుబడులపై చేసిన విదేశీ మారకద్రవ్యాన్ని పరిగణనలోకి తీసుకుంటే… ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతీయులు 19,354 మిలియన్ డాలర్లు విదేశాలకు పంపించారు. ఇది అత్యధికంగా విదేశీ చెల్లింపులు చేసిన ఆర్థిక సంవత్సరం 2022కు దగ్గరగా ఉంది. 2022 ఆర్థిక సంవత్సరంలో విదేశాలకు మొత్తం 19,610 మిలియన్ డాలర్లను విదేశాలకు పంపించారు.
2018 వరకు నెలవారి సగటు చెల్లింపులు ఒక బిలియన్ డాలర్ల కన్నా తక్కువగా ఉండేంది. కానీ ఇప్పుడు బారతీయులు నెలవారీగా 2 బిలియన్ల డాలర్ల వరకు విదేశాలకు పంపుతున్నారు. డాలర్లపై మోజు, విదేశీ ప్రయాణాలపై మోజుతోనే పెరిగినట్టు నివేదిక పేర్కొంది. ఆర్థిక సంవత్సరం 2022లో 35శాతంతో పోలిస్తే 2023లో ప్రయాణ వాటా 51శాతానికి పెరిగింది.