– పడిపోతున్న షేర్స్.. ఆవిరవుతున్న సంపద
– హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ తో దుమారం
– అదానీ అబద్ధాలే కొంప ముంచాయా?
– షెల్ కంపెనీల అవకతవలపై కేంద్రం వైఖరేంటి?
– అదానీ కంపెనీ వివరణపైనే అందరి చూపు!
– త్వరలో హైదరాబాద్ లోని బడా కంపెనీల..
– బండారం బయటపడుతుందని ప్రచారం
క్రైంబ్యూరో, తొలివెలుగు:అత్యంత వేగంగా ప్రపంచ కుబేరుల్లో టాప్ 3లో నిలిచిన అదానీ గ్రూప్ షేర్స్ ఢమాల్ అంటున్నాయి. దీనికి సంబంధించి ఓ రీసెర్చ్ నివేదిక కలకలం పుట్టిస్తోంది. దేశంలో బీజేపీ అండదండలతో అదానీ ఎదిగారని విపక్షాలు తరచూ ఆడిపోసుకుంటూ ఉంటాయి. ఇలాంటి సమయంలో హిండెన్ బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ షేర్ మార్కెట్ ని షేక్ చేస్తోంది.
అదానీ కుటుంబం విదేశాల్లో షెల్ కంపెనీలు సృష్టించి.. వాటి ద్వారా పెద్దఎత్తున అవినీతికి పాల్పడుతూ.. మనీ లాండరింగ్ చేసిందని.. అందుకు పన్నుల ఎగవేతకు ఈజీ అయిందని హిండెన్ బర్గ్ నివేదిక చెబుతోంది. లిస్టెడ్ కంపెనీల ద్వారా నిధులను అక్రమంగా తరలించినట్లు తెలిపారు. గత 5 సంవత్సరాలుగా అకౌంటింగ్ ఫ్రాడ్స్ జరిగాయని స్టాక్ మానిఫ్యులేషన్ కు పాల్పడి షేర్ ధరలు పెంచుకున్నారని ఆధారాలు సంపాదించారు.
ఇన్వెస్టిగేషన్ చేసి బట్టబయలు!
అదానీ లాంటి కంపెనీలపై ఆరోపణలు చేయాలంటే లీగల్ గా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. అయితే.. అందుకు తగ్గట్టుగా ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఎక్కడ తేడా వచ్చినా ఆ టీం కటకటాల పాలు కావాల్సిందే. ఈ నేపథ్యంలో అన్నీ సమకూర్చుకునే హిండెన్ బర్గ్ నివేదిక బయటపెట్టినట్లు తెలుస్తోంది. వేలాది డాక్యుమెంట్స్ పరిశీలించి, అదానీ డైరెక్టర్స్, ఆ కంపెనీ ప్రతినిధుల ఇంటర్వ్యూలు స్టింగ్ ఆపరేషన్స్ తో అన్నీ సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల విలువ అనుకున్న దానికంటే చాలా ఎక్కువగా ఉన్నాయని ఫోరెన్సిక్ ఫైనాన్సియల్ రీసెర్చ్ కంపెనీ నివేదికలో పేర్కొన్నట్టు డాక్యుమెంట్స్ సంపాదించారు. అదానీ అబద్ధాలతో లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని మీడియా కథనాలు వస్తున్నాయి. ఇప్పటికే విదేశీ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంపై సెబీ కూడా అదానీ గ్రూప్ నుంచి కేవైసీ కోరినట్టు సమాచారం. దీంతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు పతనం అయ్యాయి. ఇప్పటి వరకు ఈ గ్రూప్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ 46వేల కోట్ల రూపాయల మేర పతనం అయింది. ఈ దెబ్బకు బుధవారం స్టాక్ మార్కెట్ కుప్పకూలిపోయింది.
హైదరాబాద్ కంపెనీల బండారం ఉందా?
హిండెన్ బర్గ్ రీసెర్చ్ దగ్గర హైదరాబాద్ బేస్డ్ కంపెనీల వ్యవహారం కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రభుత్వ అండదండలతో అత్యంత వేగంగా అభివృద్ది చెందిన పారిశ్రామిక వేత్తల లిస్ట్ రెడీ చేసుకున్నట్లు తెలుస్తోంది. తక్కువ సమయంలో ఎక్కవ సంపాదించడానికి కారణాలు ఏంటని అమెరికాకు చెందిన ఈ రీసెర్చ్ సెంటర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు వినికిడి. అందుకు ఓ ఇన్వెస్టిగేషన్ రిపోర్టర్ సహాయం తీసుకున్నట్టు ప్రచారంలో ఉంది. అదే జరిగితే.. బడా సంస్థలుగా చెలామణీ అవుతున్న టాప్ 3 కంపెనీల చిట్టా ఓ ఫైన్ డే బయటపడే అవకాశాలు ఉన్నాయి.