బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాగానే ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించారు. అనంతరం పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టారు.
పార్లమెంట్ లో రేపు ఉదయం ఆమె వార్షిక బడ్జెట్ ను ప్రవేశ పెట్టనున్నారు. ఆర్థిక సర్వే ముఖ్యమైన నివేదిక. ఇది గతేడాది ఖాతాలను, వచ్చే ఏడాదికి సంబంధించిన పరిష్కారాలను గురించి తెలుపుతుంది. ప్రతి ఏడాది ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు పర్యవేక్షణలో దీన్ని రూపొందిస్తారు.
దేశ ఆర్థిక వ్యవస్థ ఈ ఆర్థిక సంవత్సరంలో 7 శాతం వృద్ధి సాధిస్తుందని ఆర్థిక సర్వే పేర్కొంది. 2021-22లో 8.7 శాతంతో పోలిస్తే 2023-24లో 6.5 శాతం వృద్ధి చెందుతుందని వెల్లడించింది. ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని సర్వే పేర్కొంది.
సర్వే ప్రకారం…. ఈ ఏడాది మార్చిలో భారతదేశ నామమాత్రపు జీడీపీ 3.5 ట్రిలియన్ యూఎస్ డాలర్లుగా ఉంటుంది. వినియోగదారుల ధరల పెరుగుదల గణనీయంగా తగ్గింది. వార్షిక ద్రవ్యోల్బణం 6 శాతం కంటే తక్కువగా ఉంది. టోకు ధరలు 5 శాతం కంటే తక్కువ రేటుతో పెరుగుతున్నాయి. 2021-22లో ఇదే కాలంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి తొమ్మిది నెలల్లో వస్తువులు, సేవల ఎగుమతి 16 శాతం పెరిగింది.