శ్రీలంక కన్నా భారత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం విమర్శించారు. దాన్ని పరిష్కరించేందుకు అఖిల పక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరారు.
‘భారత ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. శ్రీలంకలో ప్రజలు నిరసనగా వీధుల్లోకి వచ్చారు. శ్రీలంకతో పోల్చినప్పుడు భారత ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది’ అని అన్నారు.
ఈ సందర్బంగా కేంద్రంపై మమతా తీవ్రంగా మండిపడ్డారు. కేంద్ర సంస్థలను ఉపయోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలవంతంగా నియంత్రించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
దానికి బదులుగా సంక్షోభాన్ని ఎలా అధిగమించాలో కేంద్రం ఆలోచించాలని, అందుకోసం అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి సలహాలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
‘ కేంద్రానికి ఓ ప్లానింగ్ లేదు. 13 రోజుల్లో 11 సార్లు ఇంధన ధరలు పెరిగాయి. ప్రావిడెంట్ ఫండ్‌పై వడ్డీని తగ్గించారు. రైల్వేల నుంచి బ్యాంకుల వరకు అన్నింటిని అమ్మకానికి పెడుతున్నారు. చాలా రాష్ట్రాలు జీఎస్టీలో తమ వాటాను పొందలేదు ’ అని ఆమె తెలిపారు.