కరోనా ఉధృతి తగ్గుతోంది. కేసులు నెమ్మదిగా తగ్గుముఖం పడుతున్నాయి. పలు రాష్ట్రాలు కరోనా ఆంక్షలను ఎత్తివేస్తున్నాయి. మాస్కులు తప్పని సరి నిబంధనను ప్రభుత్వాలు తొలగిస్తున్నాయి.
ఇప్పుడిప్పుడే అందరూ కొంత ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇలాంటి నేపథ్యంలో దేశంలో కరోనా కొత్త వేరియంట్ కలకలం రేపుతోంది. బ్రిటన్ లో వెలుగుచూసిన కొత్త వేరియంట్ ఎక్స్ ఈ ఇప్పుడు భారత్ లోకి అడుగుపెట్టింది.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా ఎక్స్ఈ తొలి కేసు బుధవారం నమోదైంది. ఈ విషయాన్ని బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. దీనితో పాటు కప్పా వేరియంట్ కేసు కూడా నమోదైనట్టు సంస్థ తెలిపింది.
ముంబైకి చెందిన 50 ఏండ్ల డిజైనర్ కు ఎక్స్ ఈ వేరియంట్ వచ్చినట్టు గుర్తించామని సంస్థ పేర్కొంది. ఆమె ఫిబ్రవరిలో ఆఫ్రికాకు వెళ్లివచ్చినట్టు అధికారులు తెలిపారు.