తన సొంత రాష్ట్రం గుజరాత్ కు ప్రధాని మోడీ ఇస్తున్న వరాలు ఇన్నీఅన్నీ కావు. ఇటీవలే ఈ రాష్ట్రంలో కొన్ని వేల కోట్లు వ్యయం కాగల ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు చేశారు. కొన్నింటిని ప్రారంభించారు. ఇప్పుడు మళ్ళీ తాజాగా ఆదివారం ఆయన ఈ రాష్ట్రాన్ని విజిట్ చేసి తిరిగి మరిన్ని ప్రాజెక్టులకు శ్రీకారం చుడుతున్నారు. వీటిలో అత్యంత ప్రధానమైనది మెహసానా జిల్లా లోని మొధేరా గ్రామాన్ని సౌర విద్యుత్ కాంతులతో నింపే ప్రాజెక్టు.. దీన్ని ఆయన ప్రారంభించనున్నారు.
దేశంలోనే మొట్టమొదటి సౌర విద్యుత్ సౌకర్యం గల గ్రామంగా మొధేరా పతాక శీర్షికల కెక్కనుంది. పునరుత్పాదక ఇంధన వాడకాన్ని వ్యాప్తి చెందింపజేసే చర్యల్లో దీన్ని గణనీయమైనదిగా పేర్కొంటున్నారు. మొధేరా లో ఉన్న సూర్య దేవాలయం ఈ గ్రామానికి ప్రత్యేక ఆకర్షణ. 24 గంటలూ సౌర విద్యుత్ ని ఇస్తున్న గ్రామంగా మోడీ… మొధేరాను ప్రకటించనున్నారు.
రూ. 3,900 కోట్ల వ్యయమయ్యే వివిధ ప్రాజెక్టులను కూడా ఆయన ప్రారంభించనున్నారు. మెహసానా జిల్లాలో ఈ సాయంత్రం జరిగే పలు కార్యక్రమాల్లో మోడీ పాల్గొంటున్నారు. ఇక్కడి మొధేశ్వరీ మాత ఆలయాన్ని, సూర్య మందిరాన్ని ఆయన విజిట్ చేయనున్నారు. మొధేరా గ్రామంలోని ఇళ్లపై ప్రభుత్వం వెయ్యికి పైగా సోలార్ ప్యానెల్స్ (సౌర ఫలకాలను) ఏర్పాటు చేసింది. దీంతో ఈ గ్రామస్థులకు ఉచితంగా సౌర విద్యుత్ లభించనుంది.
ఇక్కడి సూర్య దేవాలయాన్ని ఇదివరకే పురావస్తు ప్రాధాన్యం గల సైట్ గా ప్రకటించారు. ఈ ఆలయానికి ఇక 3-డీ ప్రొజెక్షన్ ఫెసిలిటీ కల్పిస్తారని, 3-డీ డిస్ ప్లే వ్యవస్థను మోడీ జాతికి అంకితం చేస్తారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇందులో మొధేరా చరిత్రను టూరిస్టులకు వివరిస్తారు. ప్రతి రోజూ సాయంత్రం 3-డీ ప్రొజెక్టర్ ద్వారా విరజిమ్మే కాంతులను ప్రజలు చూడవచ్చునని ఈ వర్గాలు పేర్కొన్నాయి. మొధేరా లో ప్రభుత్వ కార్యాలయాలు, ఇళ్లపై 1300 కు పైగా రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ని కూడా ఏర్పాటు చేశారని, ఇవన్నీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్స్ తో పని చేస్తాయని తెలుస్తోంది.