భారత్ లో పామ్ ఆయిల్ దిగుమతులు మార్చిలో గణనీయంగా పెరిగాయి. అంతకు ముందు నెలతో పోలిస్తే మార్చిలో ఈ దిగుమతులు 18.7శాతం అధికంగా ఉన్నాయి. ఉక్రెయిన్ లో పరిస్థితుల నేపథ్యంలో అక్కడి నుంచి సన్ ఫ్లవర్ దిగుమతులు ఇబ్బందిగా మారాయి. దానికి ప్రత్యామ్నాయంగా పామ్ ఆయిల్ ను వ్యాపారులు పరిగణించడంతో దిగుమతులు పెరిగినట్టు తెలుస్తోంది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో పామ్ ఆయిల్ దిగుమతులు 454,794 టన్నులు ఉండగా, మార్చి నాటికి ఇది 539,793 టన్నులకు చేరినట్టు సాల్వెంట్ ఎక్స్ ట్రాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎస్ఈఏ) వెల్లడించింది.
ఫిబ్రవరిలో 152,220 టన్నుల సన్ ఫ్లవర్ ఆయిల్ ను భారత్ దిగుమతి చేసుకుంది. మార్చిలో ఈ దిగుమతులు 212,484 టన్నులకు పెరిగింది. యుద్ధం ప్రారంభం అయ్యే సమయంలో ఉక్రెయిన్ పంపించిన కొన్ని నౌకలు భారత్ కు మార్చిలో చేరుకోవడంతో ఈ పెరుగుదల సంభవించినట్టు చెప్పింది.
అయితే ఉక్రెయిన్ నుంచి ఎలాంటి నౌకలు భారత్ కు రాకపోవడంతో ఏప్రిల్ నెలలో సన్ ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు 80,000 టన్నులకు పడిపోయింది. ఇందులో ప్రధానంగా ఈ ఎగుమతులు రష్యా, అర్జెంటీనా నుంచి వచ్చినవే కావడం గమనార్హం.
ఉక్రేయిన్ సన్ ఫ్లవర్ ఆయిల్ సరఫరాను నిలిపివేయడంతో స్థానిక మార్కెట్‌లో ఎడిబుల్ ఆయిల్ ధరలు పెరిగాయి. దీంతో ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో అత్యధిక ధరకు 45,000 టన్నుల సన్‌ఫ్లవర్ ఆయిల్ కోసం రష్యాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది.