సివంగి.. ఆడపులి.. ఈ డైలాగులు ఎక్కువగా సినిమాలో వినిస్తుంటాయి. కానీ.. టర్కీ ఇస్తాంబుల్ వేదికగా జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్ లో అందరూ రియల్ గా చూశారు. తెలంగాణ బిడ్డ నిఖత్ జరీన్ ఇచ్చిన ఒక్కో పంచ్ పులి పంజా మాదిరి అనిపించింది.
ఫైనల్స్ లో థాయ్ లాండ్ కు చెందిన జిత్పోంగ్ జుటామాతో తలపడింది నిఖత్. మొదట్నుంచి అదిరిపోయే పంచ్ లతో అదరగొట్టి మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణాన్ని గెలుచుకుంది. 52 కేజీల విభాగంలో నిఖత్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించింది.
భారత్ తరుపున గతంలో మేరికోమ్, సరితా దేవి, జెన్నీ ఆర్ఎల్, లేఖ సీ మాత్రమే ఈ టోర్నీల్లో ఛాంపియన్లుగా నిలిచారు. ఇప్పుడు ఆ జాబితాలో నిఖత్ జరీన్ చేరింది. ప్రపంచ టైటిల్ సాధించిన ఐదో భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది. 25ఏళ్ల నిఖత్ నిజామాబాద్ కు చెందిన బాక్సర్. జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గానూ నిలిచింది. ఇప్పుడు సీనియర్ స్థాయిలోనూ తొలిసారి టైటిల్ ను ముద్దాడింది.
నిఖత్ విజయం తెలంగాణకే గర్వకారణమని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ పోటీల్లో నిజామాబాద్ ముద్దుబిడ్డ బంగారు పతకం సాధించడం హర్షణీయని తెలిపారు. జరీన్ కు వ్యక్తిగతంగా లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకం అందిస్తానని వెల్లడించారు.