అంతరిక్షం ఇక అందరిదీ కానుందా? సామాన్యులకు ఓ బ్రహ్మ పదార్థంగా, ప్రభుత్వం మాత్రమే పరిశోధనలు చేసే రహస్య రంగంగా ఉంటూ వస్తున్న వ్యవస్థ.. ఇక సాధారణ ప్రజలకూ అందుబాటులోకి రానుందా? అంటే అవుననే అంటున్నారు నిపుణులు. అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ అంతరిక్ష విహర యాత్రతో.. యుఎస్‌లో ఇప్పటికే ప్రైవేట్ ప్లేయర్‌లు, కంపెనీలు సత్తా చాటుతుండగా.. భారతదేశంలోనూ ఆ ట్రెండ్ కనిపిస్తోంది. మూడేళ్లుగా అంతరిక్ష పరిశ్రమలోకి వచ్చే ప్రైవేట్ కంపెనీల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.
ప్రపంచంలోని 440 బిలియన్ డాలర్ల పరిశ్రమలో.. భారత అంతరిక్ష రంగం వాటా కేవలం 2 శాతమే. పైగా అది కూడా ప్రభుత్వానిదే. కానీ భవిష్యత్తులో ఈ వాటా పెరగడం ఖాయంగా కనిపిస్తోంది. భారత అంతరిక్ష రంగంలో ప్రైవేట్ ప్లేయర్లు వస్తుండటంతో అది సాధ్యం కానుంది. కానీ అది జరిగేందుకు సుదీర్ఘ సమయమే పట్టే అవకాశాలున్నాయని నిపుణులు అంటున్నారు.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) కార్యకలాపాల్లో.. ఇప్పటికే ప్రైవేట్ ప్లేయర్స్ పాలు పంచుకుంటున్నాయి. వాస్తవానికి గోద్రెజ్, ఆంధ్రా షుగర్స్ వంటి కంపెనీలు ఇస్రోలో తొలి రోజుల్లోనే కలిసి పనిచేశాయి. వీటిని మొదటి తరం ప్రైవేట్ ప్లేయర్స్‌గా చెప్తుంటారు. అయితే ఇస్రోతో భాగస్వామ్యాన్ని వారు గర్వంగానే చూశారే కానీ.. వ్యాపార కోణంలో చూడలేదు. పైగా అప్పట్లో కొన్ని ఉపగ్రహ ప్రయోగాలు మాత్రమే జరిగాయి. 1980 చివరలో , 1990 ప్రారంభంలో ఉపగ్రహ ప్రయోగాలు వరుస విజయాలు సాధించడంతో ఇస్రో.. బిల్డ్ టు ప్రింట్ విప్లవాన్ని చూసింది. క్లయింట్లు కోరుకున్న స్పెసిఫికేషన్‌ల ప్రకారం ఉత్పత్తులను తయారు చేసి ఇవ్వడం మొదలుపెట్టాయి.
అంతరిక్ష రంగంలో పూర్తి స్థాయిలో ఉపగ్రహ వ్యవస్థలను తయారు చేసే మొదటి ప్రైవేట్ కంపెనీలుగా అనంత్ టెక్నాలజీస్ , సెంటమ్ ఎలక్ట్రానిక్స్ పేరు సంపాదించుకున్నాయి. అనంత్ టెక్నాలజీస్ 1992 నుంచి ఇస్రో కోసం ఉపగ్రహ వ్యవస్థలను తయారు చేస్తోంది. ఇక సెంటమ్ ఎలక్ట్రానిక్స్ 1994 నుంచి ఉపగ్రహాలు, రాకెట్‌ల కోసం ఎలక్ట్రానిక్ భాగాలను రూపొందిస్తోంది. ఇస్రోకు వివిధ రూపాల్లో మద్దతు ఇచ్చిన ప్రైవేట్ కంపెనీలు.. 1960 నుంచి దాదాపు 500 వరకు ఉంటాయని కానీ.. నేరుగా పరిశోధనలో పాలు పంచుకున్నవి చాలా తక్కువ అని నిపుణులు చెబుతున్నారు. అయితే 2000 సంవత్సరం తర్వాత Earth2Orbit, Devas Multimedia , Team Indus వంటి ప్రైవేట్ స్పేస్ సంస్థలు వెలియడంతో.. కాస్త ఊపు వచ్చిందని అంటున్నారు.
వాస్తవానికి 2000వ సంవత్సరం నాటికి భారత్‌లో అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సంస్థలు పెరిగేవే కానీ.. 1998లో భారత్ భూగర్భ అణు పరీక్షలు నిర్వహించడంతో యూఎస్ ఆర్థిక ఆంక్షలు విధించింది. రక్షణ, సాంకేతిక సామగ్రి ఎగుమతిని నిషేధించింది. ఉపగ్రహాలు కూడా ఆంక్షల కిందకు వచ్చాయి. ఆతర్వాత కొన్నాళ్లకు పరిస్థితులు చక్కబడినా.. మళ్లీ ఓ కుదుపు చూడాల్సి వచ్చింది. S- బ్యాండ్ శాటిలైట్ స్పెక్ట్రమ్‌ను లీజు విషయంలో ఆంట్రిక్స్ కార్పొరేషన్ లిమిటెడ్‌పై ఆరోపణలు రావడంతో.. ప్రైవేట్ పరిశ్రమ 10 సంవత్సరాల పాటు నిలిచిపోవాల్సి వచ్చింది. అయితే స్టారప్ కంపెనీలుగా వచ్చిన అగ్నికుల్ కాస్మోస్, స్కైరూట్ ఏరోస్పేస్, పిక్సెల్ , బెల్ట్రిక్స్ ఏరోస్పేస్ వంటివి గణనీయమైన వృద్ధిని సాధించడంతో.. మళ్లీ ఆశలు చిగురించాయి.
నిపుణుల ప్రకారం.. అంతరిక్షం రంగంలో ప్రస్తుతం దాదాపు 50 కంపెనీలు డౌన్‌స్ట్రీమ్ విభాగంలో పని చేస్తున్నాయి. స్పేస్ టెక్నాలజీని ఉపయోగించి. వివిధ అప్లికేషన్లతో పాటు అంతరిక్షంలోకి వస్తువులను పంపే పని కూడా చేస్తున్నాయి. వాతావరణం, కమ్యూనికేషన్, టెక్నాలజీ వంటి విభాగాల్లో స్వంతంగా పరిశోధనలు చేస్తూ.. వాణిజ్య పరంగా ఎదుగుతున్నాయి.