ఇండియాకు చెందిన వైల్డ్ లైఫ్ బయాలజిస్ట్ డా. పూర్ణిమాదేవి బర్మన్ కు ఐక్యరాజ్యసమితికి చెందిన పర్యావరణ విభాగం అత్యున్నత అవార్డును ప్రకటించింది. ఈ ఏడాదికి గాను ‘ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్’ పురస్కారం ఈమెను వరించింది. అస్సాం కు చెందిన ఈమె పర్యావరణ పరిరక్షణ కోసం చేసిన కృషిని గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంటల్ ప్రోగ్రాం అధికారులు వెల్లడించారు.
మరో నాలుగు దేశాలకు చెందిన పర్యావరణ వేత్తలను కూడా ఈ అవార్డుకు ఎంపిక చేశారు. గ్రీన్ ఆస్కార్ విన్నర్ అయిన పూర్ణిమా దేవి సుమారు రెండు దశాబ్దాలుగా ‘హర్గిలా’ అనే పేరిట కొంతమంది మహిళలతో కలిసి..’కన్సర్వేషనిస్ట్ గ్రూప్’ ని ఏర్పాటు చేశారు. కనుమరుగైపోతున్న ‘హర్గిలా’ అనే పక్షి జాతిని రక్షించేందుకు ఈమె తన బృందంతో బాటు కృషి చేశారట.
ఈ పక్షి పేరిట ‘హర్గిలా ఆర్మీ’ అనే సంస్థను కూడా పూర్ణిమా దేవి ఏర్పాటు చేసినట్టు తెలిసింది. ఎంటర్ ప్రెన్యూర్ విజన్ కేటగిరీలో ఈమెను ఐరాస ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ఆమె ఆధ్వర్యాన ఈ బృందం ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వస్త్రాలను కూడా అమ్మిందట. తనకు ఈ అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉందని, తన కల నెరవేరిందని, దీన్ని ఈ భూగ్రహం పైని తల్లులకు, ‘మాతృ భూమికి’ అంకితం చేస్తున్నానని పూర్ణిమా దేవి ప్రకటించారు.
ఈ అవార్డు కోసం ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా ఐరాస పర్యావరణ విభాగానికి 2,200 నామినేషన్లు అందాయి. ఛాంపియన్స్ ఆఫ్ ది ఎర్త్ పురస్కారాలకు మొత్తం 5 గురిని ఎంపిక చేయగా వారిలో పూర్ణిమాదేవి ఒకరు. 5 అడుగుల ఎత్తయిన హర్గిలా పక్షి జాతి క్రమేణా కనుమరుగైపోతోంది. ఇండియా,కాంబోడియా సహా ఆగ్నేయాసియా దేశాల్లోఈ జాతి పక్షులు కేవలం 1200 మాత్రమే ఉన్నాయట. ఇండియాలో అస్సాం, బీహార్ రాష్ట్రాల్లో ఇవి కనిపిస్తాయి.