భారత కుర్రాళ్లు చెలరేగిపోయారు. అద్వితీయ ఆటతీరుతో భారత్ ను విశ్వవిజేతగా నిలిపారు. దేశానికి ఐదో ప్రపంచకప్ అందించారు. అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా గత రాత్రి ఇంగ్లండ్ తో జరిగిన తుది సమరంలో యువ భారత్ మరోమారు కలిసికట్టుగా రాణించింది. ఇంగ్లండ్ ను నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసి టైటిల్ ను ఎగరేసుకుపోయింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 190 పరుగుల విజయ లక్ష్యాన్ని 47.4 ఓవర్లలో ఆరు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది.
లక్ష్య ఛేదనలో భారత్ తొలుత కొంత తడబడినట్టు కనిపించింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ రఘువంశీ డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన తెలుగు కుర్రాడు షేక్ రషీద్ చక్కని సమయస్ఫూర్తితో ఆడాడు. ఓపెనర్ హర్నూర్ సింగ్ తో కలిసి ఇన్నింగ్స్ ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో 21 పరుగులు చేసిన సింగ్ రెండో వికెట్ గా వెనుదిరిగాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ యశ్ ధుల్ (17) కూడా క్రీజులో నిలదొక్కుకోలేకపోవడంతో ఇంగ్లండ్ పట్టుబిగించింది.
మరోవైపు.. భారత శిబిరంలో ఆందోళన నెలకొంది. అయితే.. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన నిశాంత్ సింధుతో కలిసి రషీద్ సంయమనంతో ఆడుతూ ఇన్నింగ్స్ ను చక్కదిద్దాడు. ఇద్దరూ కలిసి జాగ్రత్తగా ఆడుతూ జట్టును విజయం దిశగా నడిపించారు. రషీద్ అర్ధ సెంచరీ చేసి అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రాజ్ బవా చక్కని ఇన్నింగ్స్ ఆడాడు. 35 పరుగులు చేసి ఇంగ్లండ్ ఆశలను వమ్ము చేశాడు. కౌశల్ తాంబే (1) వచ్చినంత వేగంగా పెవిలియన్ చేరినా.. వికెట్ కీపర్ దినేశ్ బానా (13)తో కలిసి నిశాంత్ ఎలాంటి తొందరపాటు లేకుండా ఆడాడు. తుదిసమరంలో పోరాడి అజేయంగా నిలిచి జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు.
నార్త్ సౌండ్ లోని సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియం వేదికగా నిలిచిన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్.. మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల తాకిడికి తట్టుకోలేక ఇంగ్లండ్ 44.5 ఓవర్లలో 189 పరుగులకు కుప్పకూలింది. పిచ్ పరిస్థితులను చక్కగా ఉపయోగించుకున్న భారత పేసర్లు ఇంగ్లండ్ టాపార్డర్ ను కకావికలం చేశారు. ముఖ్యంగా రాజ్ బవా 5 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. అతని తోడు రవికుమార్ 4 వికెట్లతో రాణించాడు. ఓ దశలో ఇంగ్లండ్ జట్టు 61 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. వరుస చూస్తే ఆ జట్టు 100 పరుగులు చేయడం కూడా కష్టమే అనిపించింది.
ఈ క్రమంలో మిడిలార్డర్ బ్యాట్స్ మన్ అద్భుతంగా ఆడి 95 పరుగులు చేశాడు. 116 బంతులు ఎదుర్కొన్న రూ 12 ఫోర్లు కొట్టాడు. అతడికి జేమ్స్ సాలెస్ 34 నాటౌట్ ఉంటూ మంచి సహకారం అందించాడు. అంతకుముందు.. ఓపెనర్ జార్జ్ థామస్ 27 పరుగులు చేశాడు. కాగా.. టోర్నీలో ఇప్పటిదాకా విశేషంగా రాణించిన భారత కుర్ర స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో తేలిపోయారు. ఐదు వికెట్లు తీసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రాజ్ బవాకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
అండర్-19 ప్రపంచకప్ ఫైనల్ లో టీం ఇండియా ప్లేయర్లు ఇంగ్లాండ్ ను చిత్తు చేసి తమ సత్తాను చాటుకున్నారు. దీంతో దేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. వరల్డ్ కప్ ను అందించి క్రికెట్ అభిమానుల్లో జోష్ నింపారు భారత కుర్రాళ్లు. ఫైనల్ లో ఇంగ్లండ్ ను మట్టి కరిపించి దేశానికి మరో ప్రపంచకప్ అందించిన భారత కుర్రాళ్ల జట్టుకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. గత రాత్రి ఇంగ్లండ్ తో జరిగిన ఫైనల్ లో యువ భారత జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించి.. ఐదో ప్రపంచకప్ ను తన ఖాతాలో వేసుకుంది.
ఇంగ్లండ్ ను చిత్తు చేసిన భారత కుర్రాళ్లను బీసీసీఐ చీఫ్ సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షా అభినందించారు. ఈ సందర్భంగా ఆటగాళ్లు ఒక్కొక్కరికీ రూ. 40 లక్షల చొప్పున నజరానా ప్రకటించారు. అలాగే.. సహాయక సిబ్బందికి రూ. 25 లక్షల చొప్పున బహుమతి ప్రకటించారు. అండర్-19 వరల్డ్ కప్ ఫైనల్లో టీమిండియా బౌలర్లు ఇంగ్లండ్ ను సమర్థంగా కట్టడి చేశారు.