రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా గురువారం రాజ్యసభలో ప్రధాని మోడీ.. కాంగ్రెస్ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మేము విపక్ష పార్టీలు అధికారంలో ఉన్న ప్రభుత్వాలను కూల్చడమే పనిగా పెట్టుకున్నామని మీరు ఆరోపిస్తున్నారని, కానీ మీ పార్టీ గత చరిత్రను చూస్తే ఇలాంటి సంఘటనలు చాలా ఉన్నాయని ఆయన అన్నారు.
తెలుగుదేశంపార్టీ వ్యవస్థాపకుడు, మాజీ సీఎం ఎన్టీ రామారావు చికిత్స కోసం అమెరికాకు వెళ్లిన సమయంలో మీ పార్టీ ఆయనను గద్దె దించే ప్రయత్నం చేసిందన్నారు. నాటి నాదెండ్ల భాస్కరరావు ఉదంతాన్ని ఆయన పరోక్షంగా గుర్తు చేశారు.
తమిళనాడులో కూడా ఎంజీఆర్, కరుణానిధి వంటి నేతల ప్రభుత్వాలను కూల్చివేసింది మీరు కాదా ? మహారాష్ట్రలో శరద్ పవార్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టారు.. రాజ్యాంగంలోని 356 ఆర్టికల్ ని నాడు ఇందిరాగాంధీ దుర్వినియోగం చేస్తూ .. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోస్తూ వచ్చారు.
ఇలా 50 సార్లు చేశారు.. కేరళలో కూడా కమ్యూనిస్టుల సర్కార్ ని కూలదోశారు.. నాడు ఆ ప్రభుత్వాన్ని ఇష్టపడని నెహ్రు ఇందుకు పూనుకొన్నారు అని మోడీ పేర్కొన్నారు. అసలు నాడు కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టికల్ ని దుర్వినియోగపరిచి 90 సార్లు ప్రభుత్వాలను పడగొట్టిందన్నారు.