తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు ప్రభుత్వ పథకాలను తీసుకోవద్దంటూ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్ రావు చేసిన వ్యాఖ్యలపై ఇందిరా శోభన్ స్పందించారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం సంక్షేమం అందించడం ప్రభుత్వ బాధ్యత కానీ.. ఎమ్మెల్యే భాస్కర్ రావు అయ్య జాగీర్ అన్నట్టు మాట్లాడటం ఏంటని మండిపడ్డారు.
ఈ మేరకు ఆమె ట్విట్టర్ లో ట్వీట్ చేస్తూ.. బీఆర్ఎస్ పార్టీ నేతలకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్లు ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దు అంటూ అనడం ఏంటని ప్రశ్నించారు. వెంటనే ఎమ్మెల్యే భాస్కర్ రావను బర్తరఫ్ చేయాలని గవర్నర్ తమిళిసై, మంత్రి కేటీఆర్ లను ట్యాగ్ చేస్తూ ఆమె డిమాండ్ చేశారు.
త్రీఫేజ్ కరెంటు 5 నుంచి 6 గంటలే ఉంటుందన్నారు. రైతన్నలకు మద్దతుగా ఆమె ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. 24 గంటల ఉంచిత కరెంటు ఇస్తున్నామని అసెంబ్లీలో, బీఆర్ఎస్ పార్టీ మీటింగ్స్ లలో ఉపన్యాసాలు చేస్తున్న కేసీఆర్, కేటీఆర్ లు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇందిరా శోభన్.
కాగా తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కేసీఆర్ ప్రభుత్వ పథకాలు తీసుకోవద్దంటూ మిర్యాలగూడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్ రావు వ్యాఖ్యానించారు. అన్నం పెట్టే వారికి సున్నం పెడుతున్నారంటూ నర్సాపూర్ గ్రామస్తులపై భాస్కర్ రావు మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడేవారు కేసీఆర్ వేయించిన రోడ్లపై నడవద్దని, సంక్షేమ పథకాలు తీసుకోవద్దంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే భాస్కర్ రావు.