ఇందిరా శోభన్
ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర ప్రభుత్వానికి తొత్తుగా మారారు. కొత్త పార్లమెంట్ భవనానికి శంకుస్థాపన చేయడం తనకు గర్వకారణంగా ఉందంటూ ప్రధాని మోదీకి కేసీఆర్ లేఖ రాయడం ఏంటి… రైతు వ్యతిరేక నల్ల చట్టాలను రద్దు చేయాలంటూ ప్రధానమంత్రికి ఎందుకు లేఖ రాయలేదు. కేసీఆర్‌కు రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే.. శుక్రవారం ప్రధానితో జరిగే భేటీలో ఈ విషయాన్ని ప్రస్తావించాలి. లేనిపక్షంలో.. ముఖ్యమంత్రి కేంద్రంతో లాలూచీ పడుతున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.. తెలంగాణలో సచివాలయం నిర్మాణం, ఢిల్లీలో పార్లమెంట్ నిర్మాణం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతుందే తప్పా.. వాటివల్ల పేదలకు ఒరిగేదేమీ లేదని ఇందిరాశోభన్ అన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ.. దేశం ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని.. పార్లమెంట్ భవనం నిర్మాణం అనవసరమని చెప్పినా మోదీ సర్కార్ పెడచెవిన పెట్టింది.
నూతన పార్లమెంట్ భవనం శంకుస్థాపన సమయంలో మోదీ మాట్లాడుతూ.. ఇది 132 కోట్ల మంది ప్రజలకు గర్వకారణమని చెప్పటం తప్పు. మూడు పూటల తిండిలేని పేదలకు, నిరుద్యోగ యువతకు, అన్నదాతలకు.. కొత్త పార్లమెంట్ నిర్మాణం ఎలా గర్వకారణమో చెప్పాలి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కళ్లు తెరిచి.. ప్రజా సంక్షేమంపై దృష్టి సారించాలి.