ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఆమె తన రాజీనామా లేఖను ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు పంపారు. కేసీఆర్‌తో కేజ్రీవాల్ దోస్తికి నిరసనగా తాను పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆమె వెల్లడించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ అంటే సామాన్యుల పార్టీ అని తాను భావించానన్నారు. కానీ అలాంటి పార్టీ తెలంగాణను మోసం చేసిన సీఎం కేసీఆర్‌తో కలిసి నడవాలని నిర్ణయించడంతో సిద్దాంతాలకు తిలోధకాలు ఇచ్చినట్లైందన్నారు.
బీఆర్ఎస్ నిర్ణయాలకు కేజ్రీవాల్ వత్తాసు పలకడంతో తాను మనస్థాపం చెందానన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ సభకు కేజ్రివాల్ వచ్చినప్పుడే ఆయన ముందు తన సందేహాలను ఉంచానన్నారు. కానీ కేవలం కంటి వెలుగు కార్యక్రమం కోసమే వచ్చానని అప్పుడు కేజ్రీవాల్ చెప్పారన్నారు.
కానీ ఈరోజు పార్లమెంట్ లో బీఆర్ఎస్ తో కలిసి ఆప్ కూడా రాష్ట్ర పతి ప్రసంగాన్ని బహిష్కరించడాన్ని ఆమె తప్పుబట్టారు. అంబేడ్కర్ ఫోటో పెట్టుకునే సీఎం కేజ్రీవాల్ ఈ రోజు రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించి ఆ పదవిని అవమానించారని ఆమె మండిపడ్డారు.