డబ్బు, అధికారమే పరమావధిగా తెలంగాణలో పార్టీలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాయని ఇటీవల ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిన ఇందిరాశోభన్ విమర్శించారు. 60 ఏళ్ల పోరాటం, ఎంతో మంది అమరుల త్యాగాలతో సాధించుకున్న రాష్ట్రాన్ని దగా కొంత మంది తహతహలాడుతున్నారని ఆమె ఆరోపించారు. దోచుకోవడం, దాచుకోవడం తప్ప.. ప్రజల ఉద్యమ ఆకాంక్షలను ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆమె చెప్పారు.
తెలంగాణలో అవినీతిమయంగా మారిన రాజకీయాలను ప్రక్షాళన చేసే లక్ష్యంతో ఆమ్ ఆద్మీ పార్టీ పనిచేస్తుందని ఆమె వివరించారు. సామాన్యుడికి అధికారం అందించి.. అధికారానికి దూరంగా ఉన్న వర్గాలను ఆప్.. అసెంబ్లీకి పంపిస్తుందని ఇందిరా శోభన్ చెప్పారు. కొత్త నాయకత్వం, కొత్త ఆలోచనలతో ముందుకు వస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీతో పనిచేసేందుకు మేధావులు, విద్యావంతులు, యువకులు, మహిళలు మరియు విద్యార్థులు కలిసి వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
కేజ్రీవాల్ నాయకత్వంలో ఢిల్లీ ప్రభుత్వం అందిస్తున్న ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ పథకాలు దేశానికే ఆదర్శమని అన్నారు. దాదాపు 90 శాతం పేద, మధ్యతరగతి ప్రజలు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో భవిష్యత్ లో ఉచిత విద్య, వైద్యం, విద్యుత్ తోపాటు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయాలన్నది ఆమ్ ఆద్మీ పార్టీ ఎజెండాగా ముందుకుపోతామని ఇందిరా శోభన్ తెలిపారు.