ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించి అమరులు కావడం గాంధీ కుటుంబ ‘గుత్తాధిపత్యమే’ కాదని, ఇంకా ఎంతోమంది ప్రాణత్యాగం చేశారని ఉత్తరాఖండ్ కి చెందిన గణేష్ జోషి అనే మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు యాక్సిడెంట్లే అని కూడా ఆయన అన్నారు. భారత దేశ స్వాతంత్య్రం కోసం భగత్ సింగ్, సావర్కర్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి ఎంతోమంది ప్రాణత్యాగం చేసి అమరులయ్యారని ఆయన చెప్పారు.
గాంధీ కుటుంబంలో జరిగినవి ‘ప్రమాదాలు’ తప్ప మరేమీ కాదని, యాక్సిడెంట్లకు, అమరవీరత్వానికి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. శ్రీనగర్ లో తన భారత్ జోడో పాదయాత్ర ముగింపు సందర్భంగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా గణేష్ జోషి ఇలా స్పందించారు.
రాష్ట్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కూడా అయిన ఈయన.. జమ్మూ కశ్మీర్ లో రాహుల్ యాత్ర సజావుగా పూర్తి అయిందంటే అందుకు ప్రధాని మోడీ ప్రభుత్వమే కారణమని వ్యాఖ్యానించారు.
మోడీ ప్రభుత్వం 370 అధికరణాన్ని రద్దు చేయకపోయి ఉంటే అక్కడ సాధారణ పరిస్థితి ఏర్పడేది కాదని, లాల్ చౌక్ లో రాహుల్ జాతీయ పతాకాన్ని ఎగురవేయలేక పోయి ఉండేవారని జోషి అన్నారు. లోగడ కశ్మీర్ లో హింసాత్మక ఘటనలు తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు కూడా బీజేపీ నేత మురళీ మనోహర్ జోషీ లాల్ చౌక్ లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారని ఆయన గుర్తు చేశారు.