ఇండోనేషియాలో తీవ్ర కలవరం రేపిన విమాన అదృశ్యపు ఘటన విషాదాంతమే అయింది. విమాన కోసం జరుగుతున్న అన్వేషణలో విమాన శకలాలు కనిపించినట్టు అసోసియేటేడ్ ప్రెస్ రిపోర్ట్ చేసింది. జావా సముద్రంలో శరీర భాగాలు, దుస్తులతో పాటు విమానానికి సంబంధించిన భాగాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దీంతో విమానం సముద్రంపై భాగంలో ఎగురుతున్న సమయంలోనే క్రాష్ అయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. విమానంతో కమ్యూనికేషన్ తెగిపోయిన సమాయాన్ని బట్టి.. కూలిన ప్రదేశాన్ని కచ్చితంగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తాజాగా దొరికిన శకలాలను సహాయక బృందాలు లకీ ద్వీపం సమీపంలో కనుగొన్నాయి. విమానం అదృశ్యమైన దాదాపుగా 24 గంటలు కావొస్తోంది. శనివారం మధ్యాహ్నం ఇండోనేషియా రాజధాని జకార్తా నుంచి పోంటియాన్‌కు విమానం బయల్దేరింది. 12 మంది సిబ్బంది, 50 మంది ప్రయాణికుల సహా మొత్తం 62 మంది విమానంలో ప్రయాణిస్తున్నారు. కాగా విమానం బయల్దేరిన నాలుగు నిమిషాల్లోనే రాడార్ సంకేతాలకు అందకుండాపోయింది.