ఇండియాలో అదానీ రేపిన సునామీ దెబ్బ ఇండోనేసియాకు చేరింది. అదానీ గ్రూప్ కారణంగా భారత దేశంలో తలెత్తిన సంక్షోభం నేపథ్యంలో మన దేశంలోని క్యాపిటల్ మార్కెట్లపై పర్యవేక్షణను మరింతగా పెంచాలని ఇండోనేసియా అధ్యక్షుడు జోకో విడోడో ..తమ దేశ ఫైనాన్షియల్ రెగ్యులేటర్ ని కోరారు. సోమవారం జరిగిన ఫైనాన్షియల్ అథారిటీ వార్షిక సమావేశంలో మాట్లాడిన ఆయన..ఇండియాలో అదానీ గ్రూపు కంపెనీల స్టాక్ మార్కెట్ విలువలు క్రాష్ అవుతున్న కారణంగా ఆ దేశం నుంచి క్యాపిటల్ నిధులు, రూపాయి వ్యాల్యూ తగ్గుదల వంటివాటిని గమనించాలని సూచించారు.
ఇండియాలో మాదిరి ఈ పరిణామాలు ఎగుడు దిగుడులకు లోనయ్యే ప్రమాదం ఉందని, అందువల్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. మన దేశంలో ఇలా జరగరాదన్నారు. ఇండోనేసియా స్టాక్ మార్కెట్ పై ప్రతికూల ప్రభావం పడకుండా చూడాలని, ఇండియాలోని పరిణామాలను ఎప్పటికప్పుడు నిశితంగా చూడాలని విడోడో పేర్కొన్నారు.
అమెరికాలోని షార్ట్ సెల్లర్ హిండెన్ బెర్గ్ రీసెర్చ్ సంస్థ.. అదానీ గ్రూపు నిర్వాకాలపై నివేదికను ప్రచురించగానే ఇండియన్ మార్కెట్లు కుదేలయ్యాయి. భారత ఆర్ధిక వ్యవస్థపైనే ప్రభావం చూపుతున్న అదానీ కంపెనీల షేర్లు పతనమవుతుండగా.. దీనిపై భారత పార్లమెంటులో విపక్షాలు ఉభయ సభలను స్తంభింపజేస్తున్నాయి.
ఈ పరిణామాలను చివరకు ఇండోనేసియా వంటి దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. అదానీ అంశంపై స్వయంగా ఇండోనేసియా అధ్యక్షుడు తీవ్రంగా స్పందించడం విశేషం. హిండెన్ బెర్గ్ తమపై చేసిన ఆరోపణలను సుదీర్ఘంగా ఖండిస్తూ అదానీ గ్రూపు ఓ స్టేట్మెంట్ ను విడుదల చేసినప్పటికీ దాని ప్రభావం ఏ మాత్రం కనిపించలేదు. ఈ రిపోర్టుపై కోర్టుకెక్కుతామని అదానీ గ్రూపు ప్రకటించగానే హిండెన్ బెర్గ్ సైతం తాము కూడా ఇందుకు సిద్ధంగా ఉన్నామని ఛాలెంజ్ చేసింది.