ఇండోర్ మెట్ల బావి ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఐదుగురు మరణించినట్టు పోలీసులు తెలిపారు. చనిపోయినవారిలో ముగ్గురు మహిళలు ఉన్నారు. ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి రద్దీ పెరగడం వల్లే ఈ ఘటన జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ లోని ఇండోర్‌లో శ్రీరామనవమి సందర్భంగా పటేల్ నగర్ లోని శ్రీ బేలేశ్వర్ మహాదేవ్ జులేలాల్ ఆలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనం భారీగా తరలివచ్చారు. అయితే.. ఓవైపు ఉత్సవాలు జరుగుతుండగా ఇంకోవైపు మెట్ల బావి పైకప్పు కూలడంతో 25 మందికి పైగా భక్తులు అందులో పడిపోయారు.
ఈ ఘటనలో 10 మందికి పైగా గాయపడ్డారు. వారిలో ఐదుగురు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నిచ్చెన, తాళ్ల సాయంతో కొందరు భక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు. బావి లోతు 50 అడుగులపైనే ఉన్నట్లు సమాచారం.
ప్రమాదం జరిగిన తర్వాత కొంతమందిని స్థానికులే ఎలాగోలా బయటకు తీశారు. ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. గాయపడిన వారికి చికిత్స కొనసాగుతోంది. పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.