నవరాత్రులలో రెండవరోజు అమ్మవారిని బాలా త్రిపురసుందరి రూపంలో పూజించాలి. త్రిపురసుందరి అంటే ముల్లోకాలలోనూ అందంగా ఉండేది అని అర్థం. త్రిపుర అనే మాటను మూడు కాలాలకు, మూడు స్థితులకు, మూడు శక్తులకూ ప్రతీకగా పేర్కొంటారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ మొదటిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చింది. రెండవరోజు అంటే ఈరోజు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా భక్తులను దీవిస్తోంది.
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో శ్రీ కనకదుర్గ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రెండవ రోజు అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు.
అభయ హస్త ముద్రతో, అక్షరమాల ధరించిన ఈ తల్లిని ఆరాధిస్తే మానసిక బాధలు తొలగిపోతాయి. నిత్య సంతోషం కలుగుతుంది. బాల త్రిపుర అనే పేరే పరమ పవిత్రమైన రూపమని చెబుతుంటారు.
శ్రీచక్రంలో కనిపించే మూడు దేవతలలో బాలా త్రిపుర సుందరి మొదటి దేవత. అందుకే అమ్మవారి అనుగ్రహం కావాలని కోరుకునే సాధకులు ముందు చిన్నపిల్ల రూపంలో ఉండే ఈ బాలాత్రిపుర సుందరి దేవినే పూజిస్తారు. ఈ అమ్మవారి అనుగ్రహంతోనే షోడశ విద్యలు మన సొంతం అవుతాయని నమ్ముతారు.
అమ్మవారికి రెండో రోజు అంటే ఆశ్వయుజ విదియ నాడు అమ్మవారికి పెరుగన్నం, పప్పుదినులతో నైవేద్యాన్ని నివేదించాలి. బెల్లం పరమాన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేస్తే అమ్మవారు కటాక్షిస్తుందని భక్తుల నమ్మకం.
అమ్మవారిని ఈ రోజు లేత గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించాలి. వీలైతే మనం కూడా ఈ రోజు అదే రంగు వస్త్రాలను ధరించాలి. బాలాత్రిపుర సుందరి అష్టోత్తరాన్ని చదువుకొంటూ, ఆ తల్లిని తుమ్మిపూలతో పూజించాలి.