ఇంద్రవెల్లి మీటింగ్ ఎఫెక్ట్ టీఆర్ఎస్ కు గట్టిగానే తగిలినట్లుంది. వరుసబెట్టి కాంగ్రెస్ నేతలపై విమర్శల దాడికి దిగారు గులాబీ నేతలు. ఇటు మేమేమన్నా తక్కువా అంటూ హస్తం పార్టీ నాయకులు ధీటైన కౌంటర్సే ఇస్తున్నారు. అయితే ఈ సభ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ రేవంత్ ను వ్యతిరేకిస్తున్న నేతల్లోనూ మార్పు తెచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా టీపీసీసీ పదవి దక్కలేదని అధిష్టానంపై విమర్శలు చేసిన ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెనక్కి తగ్గినట్లు ఉన్నారు. రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి మరీ తర్వాతి సభ గురించి చర్చలు జరిపారు.
కాంగ్రెస్ ఈనెల 18న ఇబ్రహీంపట్నంలో దళిత, గిరిజన దండోరా నిర్వహించాలని భావించింది. అయితే కొన్ని కారణాల వల్ల ఏరియాను మహేశ్వరంలోని ఔటర్ రింగ్ రోడ్డు దగ్గరకు మార్చారు. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి మాట్లాడడం హాట్ టాపిక్ గా మారింది. టీపీసీసీ చీఫ్ ప్రకటన తర్వాత వీళ్లిద్దరు మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. ప్రస్తుతం పార్లమెంటరీ కమిటీ పర్యటన ఉన్నందున 18న నిర్వహించే సభకు హాజరుకాలేనని తెలిపారు. 21 తర్వాత సభ ఎప్పుడు పెట్టినా వచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పారు కోమటిరెడ్డి.
మరోవైపు కాంగ్రెస్ సభకు పోలీసుల నుంచి అనుమతి దొరకడం లేదు. ఔటర్ రింగ్ రోడ్డు ప్రాంతంలో 40 వేల మందితో సభ నిర్వహిస్తున్నామని పర్మిషన్ కోరారు నేతలు. అయితే ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని సభకు పోలీసులు నిరాకరించారు. మరోచోట ఏర్పాటు చేసుకోవాలని చెబుతున్నారు. దీంతో ఇంకోచోట సభ ఏర్పాటు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏర్పాట్లు చేస్తోంది. అయితే కోమటిరెడ్డి అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని 21 తర్వాత సభ ఏర్పాటు చేస్తారా..? లేక.. 18నే మరోచోట ఉంటుందా..? అనేది సస్పెన్స్ గా మారింది.
దళిత, గిరిజన దండోరా పేరుతో రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ భారీ సభలకు ప్లాన్ చేసింది. క్షేత్రస్థాయిలో నాయకులను స్థానిక నేతలతో సమన్వయం చేసుకునేందుకు కో ఆర్డినేటర్లను నియమించింది. 119 నియోజకవర్గాలకు చెందినవారితో సమావేశం కూడా నిర్వహించారు రేవంత్ రెడ్డి. ప్రతీ నియోజకవర్గం నుంచి జిల్లాల పరిధిలో దండోరా కార్యక్రమం నిర్వహించి.. బహిరంగ సభలను విజయవంతం చేయాలని ప్రణాళికలు రచించారు. మరోవైపు రేవంత్, కోమటిరెడ్డి మాట్లాడుకోవడంతో కార్యకర్తలు ఫుల్ జోష్ లో ఉన్నారు.