తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్ నడిబొడ్డున నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ లో అపశ్రుతి చోటుచేసుకుంది. ఈ ప్రాంగణం ఆవరణలో జరుగుతున్న పనుల్లో అనూహ్యంగా ఓ సంఘటన జరిగింది.
ఇనుప గేట్ల అమరికలో తప్పు దొర్లి ప్రమాదశాత్తు ఓ పారిశ్రామికవేత్త దుర్మరణం పాలయ్యాడు. ఆయన మృతికి తెలంగాణ పారిశ్రామికవేత్తలు సంతాపం వ్యక్తం చేశారు. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం గాగిల్లాపూర్ కు చెందిన పారిశ్రామికవేత్త వి. సుధాకర్ (52). హైదరాబాద్ లోని చర్లపల్లిలో నివసిస్తున్నాడు. ఆయన కంపెనీ శ్రీసాయి ఇండస్ట్రీస్. కంపెనీ ఎండీగా కొనసాగుతున్నాడు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ ముందు రక్షణ వలయం ఏర్పాటు చేసే పనులు పొందాడు.
రక్షణ వలయంగా తీర్చిదిద్దే పనులు ప్రస్తుతం చకచకా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం పనులు చేస్తుండగా ఓ గేటు అకస్మాత్తుగా సుధాకర్ పై పడింది. తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రికి తరలించేలోపే మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయారు. సుధాకర్ చర్లపల్లి ఇండస్ట్రీయల్ అసోసియేషన్ , తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్స్ ఫెడరేషన్ , చర్లపల్లి ఐలా లో సభ్యులు గా పని చేశారు.