– అంతర్గత తగాదాలతో వెనుకడుగు
– విభేదాలకు తావిస్తే పాతాళానికే!
– కాంగ్రెస్ బలంగానే ఉందని పీకే సర్వేలు
– కలిసి నడవకపోతే కష్టమే
– కోమటిరెడ్డి వ్యాఖ్యలపై రాజకీయ పండితుల విశ్లేషణ
రాహుల్ గాంధీతో భేటీ తర్వాత తెలంగాణ కాంగ్రెస్ గొడవలు సద్దుమణిగాయని అంతా అనుకున్నారు. కానీ.. రేవంత్ నల్గొండ పర్యటన సందర్భంగా కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలతో వీళ్లు మారరు అనే విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఓవైపు రాహుల్ సభ కోసం కలిసి కట్టుగా పని చేస్తామని చెబుతూ.. ఇంకోవైపు అధ్యక్షుడి రాకపైనే కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేయడంపై పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందంటున్నారు రాజకీయ పండితులు.
తెలంగాణలో కాంగ్రెస్ బలహీన పడిందని.. తక్కువ అంచనా వేయడం మూర్ఖత్వమేనని సీఎం కేసీఆర్ కు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ హెచ్చరించారని అంటున్నారు విశ్లేషకులు. ఆయన చేసిన సర్వేల్లో ఇది తేలిందని చెబుతున్నారు. అయితే.. కాంగ్రెస్ నేతలు మాత్రం ఆధిపత్యం కోసం ఆరాటపడుతున్నారని అంటున్నారు. రాష్ట్రంలో అంతర్గత కలహాలే కాంగ్రెస్ కు బలహీనత అని పీకే కేసీఆర్ కు సూచించారని విశ్లేషణ చేస్తున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ను ఎవరు తక్కువ చేయడంలేదని.. వారిని వారే కించపరుచుకుంటున్నారని చురకలంటిస్తున్నారు.
కలిసి కట్టుగా నాయకులంతా విభేదాలకు తావు ఇవ్వకుండా పని చేస్తే.. ఇటు తెలంగాణలోనూ.. అటు కేంద్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ కార్యకర్తలు నమ్ముతున్నారనే విషయాన్ని నాయకులు గుర్తించాలని ఆన్నారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం వల్లనే రాష్ట్రంలోనూ.. అటు దేశంలోనూ కాంగ్రెస్ పలసబారుతోందని ఆయన తేల్చి చెప్పారు.
తమ జిల్లా బలంగానే ఉందని.. బలహీనంగా ఉన్న జిల్లాల్లో పర్యటించాలని పీసీసీ అధ్యక్షుడు రావాల్సిన అవసరం లేదని కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు కరెక్ట్ కాదనేది విశ్లేషకుల వాదన. ఎవరికి వారు తమ జిల్లా బలంగా ఉందని వ్యాఖ్యానించుకునే సంస్కృతి పార్టీకి మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. కోమటిరెడ్డి లాంటి సీనియర్ నేత, రేవంత్ రెడ్డి యూత్ ఫాలోయింగ్ ఉన్న నాయకులు కలిసి పనిచేస్తే పార్టీ బాగుంటుందని కార్యకర్తలు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. మధ్యలో కలిసినట్లు కనిపించినా.. తాజా పంచాయితీతో మళ్లీ మొదటికొచ్చినట్లే కనిపిస్తోందని అంటున్నారు విశ్లేషకులు.
అంతర్గత తగాదాలు వదిలి పెట్టి కాంగ్రెస్ ను బలపరుచుకుంటే అధికారంలోకి రావడం ఖాయమని చెబుతున్నారు విశ్లేషకులు. సొంత పార్టీ నేతలపై విమర్శలు చేస్తే.. కింది స్థాయి కార్యకర్తలు ఇతర పార్టీలకు చేరువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు అసమ్మతి గళాన్ని మానుకోకపోతే ఎప్పటికీ కాంగ్రెస్ అధికారంలోకి రాదనే విషయాన్ని గుర్తుంచుకొని ప్రవర్తించాలని వార్నింగ్ ఇస్తున్నారు రాజకీయ పండితులు.