కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్రం ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇప్పటికే దేశంలో నాలుగు చోట్ల నిర్వహించిన డ్రైరన్ విజయవంతం కావడంతో.. అదే ప్రక్రియను దేశవ్యాప్తంగా నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. జనవరి 2 నుంచి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంపిక చేసిన ప్రదేశాల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. అతి త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ మొదలుకానుందని ప్రధాని మోదీ కూడా తాజాగా ప్రకటించారు. ఈ డ్రై రన్ సక్సెక్ కాగానే.. ఆయా ప్రాంతాల్లో టీకా పంపిణీ కూడా ప్రారంభిస్తారని తెలుస్తోంది.
డ్రైరన్‌లో భాగంగా డమ్మీ కరోనా టీకా వేస్తారు. వ్యాక్సినేషన్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయో తెలుసుకొని వాటిని.. అధిగమించేందుకు చర్యలు తీసుకుంటారు. ఇదిలా ఉంటే వ్యాక్సినేషన్ కోసం కేంద్రం 83 కోట్ల సిరంజీలకు ఆర్డర్ చేసింది. వీటితో పాటు అదనంగా మరో 35 కోట్ల సిరంజీల కోసం బిడ్స్ దాఖలు చేసినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది.