మాస్ మహారాజా రవితేజ ఓ సినిమా షూటింగ్ చిత్రీకరణలో భాగంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఆయన ప్రస్తుతం నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు చిత్రానికి సంబంధించిన ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే
ప్రముఖ నటుడు మాస్ మహారాజా రవితేజ తన సినిమా చిత్రీకరణలో గాయాల పాలయ్యారు. మోకాలికి దెబ్బ తగలడం వల్ల సుమారు 10 కుట్లు పడ్డాయని తెలిసింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా షూటింగ్‌లో కొన్ని రోజుల క్రితమే ఈ సంఘటన చోటుచేసుకున్నప్పటికీ ఈ ఘటన తాజాగా వెలుగులోనికి వచ్చింది.
ఓ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్న సమయంలో రవితేజ పట్టుకున్న తాడు జారిపోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు సమాచారం. అయితే రవితేజ పూర్తిగా విశ్రాంతి తీసుకోకుండానే గురువారం ఈ సినిమా షూటింగ్ లో పాల్గొన్నారట. తన వల్ల ఇతర నటులు, సాంకేతిక నిపుణుల డేట్స్‌లో మార్పు రాకూడదని, నిర్మాత ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతోనే ఆయన ఇలా చేశారని సినీ వర్గాల్లో వినిపిస్తోంది.
స్టూవర్ట్ పురం గజందొంగ జీవితాధారంగా ఈ సినిమా రూపొందుతోంది. 1970 ల నేపథ్యంలో సాగే ఈ చిత్రంలో రవితేజ ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని గెటప్ లో కనిపించనున్నారు. దొంగాట ఫేం వంశీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.