సమాజంలో పోలీసులపై ఉన్న దుర్దేశ్యాన్ని తొలంగించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా పోలీసులు కూడా సామాన్యుల కోసం కొత్త కొత్త ఆలోచనలతో ప్రజల శాంతిభద్రతలను కాపాడుతూ వస్తున్నారు. పోలీసు స్టేషన్‌కు రావాలంటే ఒకప్పుడు భయపడే వారు కూడా ఇప్పుడు పోలీసు స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసు శాఖ మరో వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టింది. నగరంలో ఆకతాయిల ఆగడాలను కట్టడిచేసి మహిళలకు భద్రత కల్పించేందుకు, ఇతర గొడవలను అరికట్టేందుకు, సమస్యలను పరిష్కరించేందుకు, నగర వాసుల నుంచి సూచనలు, సలహాలు స్వీకరించేందుకు హైదరాబాద్ సిటీ పోలీసులు వాట్సాప్ నెంబర్ ఏర్పాటు చేశారు. ఈ నంబర్‌కు నగరవాసులు ఎవరైనా వారి సలహాలు సూచనలు తెలియజేయవచ్చని ట్విట్టర్ వేదికగా తెలిపారు.
‘అనునిత్యం హైదరాబాద్ ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ, మీ సమస్యలకి పరిష్కారాలు & సూచనలు అందిస్తూ, మీరు పంపించే ఏ సమాచారం అయిన స్వీకరించి మీ వివరాలు గోప్యంగా ఉంచుతూ తోబుట్టువులా తోడుంటుంది, ఆప్త మిత్రుడిలా ఆదుకుంటుంది. అనునిత్యం ప్రజా సేవలో 9490616555హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సప్ నంబర్’ అంటూ ట్విట్ చేశారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.