కర్ణాటక గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేఎస్ ఈశ్వరప్ప చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆయనను బర్తరఫ్ చేయాలని, జాతీయ జెండాపై ఆయన చేసిన ప్రకటనపై దేశద్రోహం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ.. కర్ణాటక కాంగ్రెస్ నిరసనలకు దిగింది. నిరసనల్లో భాగంగా కాంగ్రెస్ నేతలు గురువారం రాత్రి మొత్తం అసెంబ్లీలో గడిపారు. మాజీ సీఎం సిద్ధరామయ్య, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ తో సహా.. ఆ పార్టీ ఎమ్మెల్యేలు రాత్రి శాసనసభ, మండలిలో ఉండి నిరసన వ్యక్తం చేశారు. కొందరు నేతల అసెంబ్లీలోనే నిద్రకు ఉపక్రమించారు.
కాంగ్రెస్ నేతలు అసెంబ్లీలో నిరసనకు దిగిన విషయం తెలుసుకున్న వెంటనే మాజీ సీఎం బీఎస్ యడియూరప్ప, స్పీకర్, కొందరు మంత్రులు వెంటనే అసెంబ్లీకి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలకు నచ్చజెప్పి నిరసనను విరమింపజేసేందుకు ప్రయత్నించారు. అయితే.. కాంగ్రెస్ సభ్యులు మాత్రం మంత్రి కేఎస్ ఈశ్వరప్పపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం బీఎస్ యడియూరప్ప మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలకు దాదాపు రెండు గంటలపాటు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయిందన్నారు. అసెంబ్లీలో నిద్రపోవద్దని సూచించామన్నారు. కానీ.. వాళ్లు ముందే నిర్ణయించుకున్నారని అన్నారు. మరోసారి వారికి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తామన్నారు.
అయితే.. ఇటీవల ఈశ్వరప్ప మాట్లాడుతూ.. కాషాయ జెండా భవిష్యత్తులో జాతీయ జెండాగా మారే అవకాశం ఉందని అన్నట్టుగా మీడియా నివేదికలు పేర్కొన్నాయి. ఎర్రకోటపై కూడా ఆ జెండాను ఎగురవేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం త్రివర్ణ పతాకం జాతీయ జెండా అని.. దానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని ఆయన అన్నారు.
అయితే.. కేఎస్ ఈశ్వరప్ప వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ.. కాంగ్రెస్ నేతలు జాతీయ జెండాను పట్టుకుని అసెంబ్లీలో నిరసన చేపట్టారు. ఈ నేపథ్యంలో స్పందించిన కర్ణాటక ముఖ్యమంత్రి.. అసెంబ్లీలో కాంగ్రెస్ ఫ్లాగ్ కోడ్ ఉల్లంఘించిందని ఆరోపించారు. అసెంబ్లీలో బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా వ్యవహరించడంలో కాంగ్రెస్ విఫలమైందని ఆయన విమర్శించారు.
గురువారం కూడా కాంగ్రెస్ సభ్యులు అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. ఉదయం అసెంబ్లీలో సమావేశమైన వెంటనే.. కాంగ్రెస్ సభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. ఫిబ్రవరి 14న మరణించిన మాజీ ఎమ్మెల్యే మల్లూరు ఆనందరావుకు సభ నివాళులర్పించిన తర్వాత.. అసెంబ్లీ స్పీకర్ ప్రశ్నోత్తరాల సమయాన్ని చేపట్టారు. అయితే.. కాంగ్రెస్ సభ్యులు మాత్రం నిరసనను వీడలేదు. ఈశ్వరప్పపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ ద్రోహి అని నినాదాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే రాత్రి అసెంబ్లీలోనే నిద్రపోయి నిరసన తెలిపారు.