భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం వచ్చి చేరింది. కల్వరి క్లాస్‌కు చెందిన ఐదో జలాంతర్గామి ఐఎన్ఎస్ వగీర్‌ను భారత నౌకా దళం ముంబైలో ప్రారంభించింది. భారత్‌లో అత్యంత వేగంగా నిర్మించిన సబ్ మెరైన్ ఐఏఎస్ వగీర్. దీన్ని 2020లో ఆవిష్కరించారు.
అప్పటి నుంచి ఫిబ్రవరి 2022 వరకు సముద్రంలో దీనిపై పరీక్షలు నిర్వహించారు. తాజాగా దీన్ని భారత నౌకదళానికి అప్పగించారు. ఇది అత్యంత నిశ్శబ్దంగా ప్రయాణించగలదు. వగీర్ చేరికతో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు మరింత పెరుగుతాయని నౌకాదళం పేర్కొంది.
ఇది శత్రు దేశాల నుంచి భారత ప్రయోజనాలను కాపాడుతుందని నౌకాదళం వెల్లడించింది. దీని సాంకేతికతను ఫ్రాన్స్ నుంచి దిగుమతి చేసుకున్నారు. ముంబైలోని మజాగావ్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్ దీన్ని నిర్మించింది. ఇది సముద్ర జలాల్లో శత్రు నౌకలు గుర్తించిడంలో, అవసరమైన సమయంలో వాటిపై దాడి చేయడంలోనూ ఈ యుద్ధ నౌక చాలా వుపయోగపడుతుందని నౌకాదళం వెల్లడించింది.
ఇందులో ప్రపంచంలోనే అత్యుత్తమ సోనార్లను ఏర్పాటు చేశారు. దీని పొడవు 221 అడుగులు, వెడల్పు 40 అడుగులు. ఇందులో నాలుగు శక్తివంతమైన డీజిల్ ఇంజిన్లు ఉన్నాయి. గంటలకు 37 కిలో మీటర్ల వేగంతో ఇది నడవగలదు. సముద్ర ఉపరితలంపై గంటకు 20 కిలోమీటర్ల వేగంతో ఇది దూసుకు వెళ్లగలదు.