భారత నౌకా దళం అమ్ముల పొదలో మరో అస్త్రం వచ్చి చేరనుంది. ఈ నెల 23న ఐదో కల్వరీ జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాగీర్‌ను భారత నౌకాదళం ప్రారంభించనుంది. ఈ జలాంతర్గామికి డ్రాగన్ నిఘా సామర్థ్యాన్ని గండి కొట్టగల సామర్థ్యం ఉందని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
సముద్రంలో చైనా నుంచి ఎదురయ్యే ముప్పునకు ఐఎన్‌ఎస్ వాగీర్‌తో చెక్ పెట్టొచ్చని నౌకాదళాధికారి దల్జీందర్ సింగ్ పేర్కొన్నారు. ఈ జలాంతర్గామి భారత నౌకాదళ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. ఈ జలాంతర్గామిని అధునాతన సాంకేతికతతో భారత్ నిర్మించింది.
ఈ జలాంతర్గామి అత్యంత నిశబ్దంగా ప్రయాణించగలదు. తద్వారా శత్రు సబ్‌మెరైన్‌లు, యుద్ధనౌకలను ఈ జలాంతర్గామి సులువుగా ఏమార్చగలదు. ఇందులో ఉండే అధునాతన సోనార్, రాడార్ వ్యవస్థలు ప్రత్యర్థి నౌకలు, జలాంతర్గాముల కదలికలను నిశితంగా గమనించగలవు.
యుద్ధం వచ్చినప్పుడు శత్రువులపై వెంటనే ఎదురు దాడికి దిగేందుకు అత్యాధునిక మైన్‌లు, టార్పిడోలను ఇందులో పొందుపరిచారు. దీన్ని అవసరాన్ని బట్టి తీరానికి దగ్గరగాను లేదా సముద్రం మధ్య లోనూ మోహరించవచ్చని అధికారులు తెలిపారు.
ఐఎన్‌ఎస్ వాగీర్‌ను ఫ్రాన్స్ సహకారంతో ముంబైలోని నౌకా నిర్మాణ సంస్థ మజ్గావ్డాక్ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ నిర్మించింది. దీన్ని నౌకాదళ పర్యవేక్షణలో పూర్తి స్వదేశీ సాంకేతికతతో నిర్మించినట్టు అధికారులు తెలిపారు. ఇప్పటికే నాలుగు కల్వరీ తరగతి జలాంతర్గాములు నావికాదళంలో సేవలందిస్తున్నాయి. తాజాగా దీని చేరికతో ఆ సంఖ్య ఐదుకు చేరుకుంది.