తెలంగాణ బీజేపీలో లీకు వీరులున్నారా…? బీజేపీ వ్యూహాలు టీఆర్ఎస్ గూటికి చేరుతున్నాయని రాష్ట్ర పార్టీ పెద్దలు అనుమానిస్తున్నారా…? అందుకే తెలంగాణ బీజేపీ ఇద్దరు కీలక నేతలు రహస్య భేటీలు నిర్వహిస్తున్నారా…?
ఇప్పటికైతే ఇవి ప్రశ్నలే. కానీ… బీజేపీ రాష్ట్ర నాయకత్వంలోని ఇద్దరు ముఖ్య నేతల వరుస రహస్య సమావేశాలు ఇవే ప్రశ్నలకు తావిస్తున్నాయి. పార్టీలోని ఇతర నేతలకు ఎవరికీ చెప్పకుండా, ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర సహాయ మంత్రి కిషన్‌రెడ్డిలు వరుసగా భేటీ అవుతున్నారు. మున్సిపల్ ఎన్నికలకు ముందు వీరిద్దరు రహస్య మీటింగ్‌ల అంతరార్ధం అదే అయి ఉండొచ్చని పార్టీ క్యాడర్ అభిప్రాయపడుతోంది.
రెండ్రోజుల కిందట లక్ష్మణ్ ఇంట్లో కిషన్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు భేటీ అయ్యారు. తాజాగా లక్డీకపూల్‌లోని ఓ హోటల్‌లో మరోసారి కిషన్‌రెడ్డి-లక్ష్మణ్ భేటీ కావటం… ఈ మీటింగ్‌పై పార్టీ నేతలెవరికీ సమాచారం లేకపోదని తెలుస్తోంది.
బలమైన నేతలను పార్టీలోకి తీసుకొచ్చు వ్యూహాంతో పాటు పార్టీ కీలక వ్యూహాలు బయటకు వెళ్లకుండానే ఈ రహస్య భేటీలు నడుస్తుండొచ్చని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో బీజేపీకి బలమైన పునాదులుండటం, రెండు ప్రముఖ కార్పోరేషన్లు బీజేపీ ఎంపీలున్న చోటే ఉండటంతో… వాటిపై బీజేపీ జెండా ఎగురేసే ఉద్దేశం ఉన్నట్లు కనపడుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.