జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌ల రూపురేఖలని సమూలంగా మార్చే పనిలో పడింది కేంద్రం. రెండేళ్లలో ఆయా ప్రాంతాల ముఖచిత్రాలనే మార్చే లక్ష్యంతో అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తోంది. ఇందుకోసం అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పనపై దృష్టిపెట్టింది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తాజాగా అక్కడ జరుగుతున్న వివిధ అభివృద్ధి పనులను పరిశీలించారు. జమ్మూ, కాశ్మీర్, లడఖ్‌ల అభివృద్ధికి నిధుల సమస్యేమీ లేదని, కానీ స్థానికంగా భూ సేకరణ, ఇతర పనులకు స్థానికుల సహకారం అవసరం ఉందని ఆయన వివరించారు. లడఖ్ ప్రజలకు జీవనరేఖగా భావిస్తున్న.. జోజిలా సొరంగం నిర్మాణ పనులను పురోగతిని స్వయంగా పర్యవేక్షించారు గడ్కరీ.
జోజిలా సొరంగమార్గాన్ని తొలుత 2026నాటికి పూర్తిచేయాలని అనుకున్నప్పటికీ, వచ్చే డిసెంబర్ కల్లా సిద్ధం చేయాలని నిర్మాణసంస్థను కోరారు గడ్కరీ . రహదారుల నిర్మాణంతోనే కశ్మీర్ సమగ్రాభివృద్ధి సాధ్యమని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకే కాశ్మీర్‌లోయలో రూ.లక్ష కోట్లతో ఆరు కీలక రహదారుల ప్రాజెక్టులను చేపట్టినట్టు వివరించారు. ఇక లడఖ్, జమ్మూ, కాశ్మీర్‌లో సొరంగాలనిర్మాణం కోసమే మరో రూ. లక్ష కోట్ల రూపాయలకు పైగా కేంద్రం ఖర్చు చేస్తోందని తెలిపారు. రెండేళ్లలో కొత్త కాశ్మీర్, లడఖ్‌లను దేశం చూడబోతోందని చెప్పారు.
జోజిలా సొరంగం నిర్మాణ విషయానికి వస్తే.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో (11,575 అడుగులు) దీన్ని నిర్మిస్తున్నారు. శ్రీనగర్, లేహ్-లడఖ్ ప్రాంతానికి మధ్య ఉన్న ఒకటో నెంబర్ జాతీయ రహదారిలో జోజిలా అత్యంత కీలకమైంది. రక్షణపరంగా కూడా ఎంతో వ్యూహాత్మకమైనది. మొత్తం 14.15 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. గతంలో చలికాలంలో మంచు కారణంగా ఈ దారిలో రహదారి అంతా మంచుతో కప్పబడి ఉటుంది. దీంతో కొన్ని నెలలపాటు వాహన రాకపోకలు నిలిచిపోతుంటాయి. ఫలితంగా స్థానిక ప్రజలతోపాటు, రక్షణ బలగాలకు ఆహారం, ఇతర వస్తువులను అందించడం కష్టతరంగా మారితోంది. జోజిలా టన్నెల్ నిర్మాణం పూర్తయితే ఏడాది పొడవునా రాకపోకలకు అంతరాయం ఉండదు.