బస్సు డ్రైవర్ కూతురు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యి ఎంతో మంది పేదవాళ్లకు స్ఫూర్తిగా నిలిచింది. ప్రత్యేకించి ఐఏఎస్ అధికారి కావాలనుకునే వాళ్లకు, ఈ పరీక్షకు సిద్ధమయ్యే వారికి ఐఏఎస్ ఆఫీసర్ ప్రీతి హుడా కథ ఉత్సాహాన్ని ఇస్తుంది. హర్యానాలో నివసించే ప్రీతి ఇంటి ఆర్థిక పరిస్థితి అస్సలు బాగుండేది కాదట. ఆమె తండ్రి డిటిసి బస్సు డ్రైవర్. అతనికి వచ్చే తక్కువ జీతంలో కుటుంబం మొత్తాన్ని చూసుకునే వారట. అలాంటి సమయంలో కుటుంబ బాధ్యత, పిల్లలకు చదువు చెప్పించడం అంత సులభం కాదు. ప్రీతి తన అవసరాలను పట్టించుకోకుండా చదువుపై మాత్రమే దృష్టి పెట్టింది. ఎం.ఫిల్ చేయడంతో పాటు ఐఏఎస్ కావాలనే కోరికతో యూపిఎస్సి పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించింది.
2017 లో ప్రీతి హుడా యూపిఎస్సి సివిల్ సర్వీసెస్ పరీక్షలో విజయం సాధించింది. ఆమె ర్యాంక్ 288. కానీ ప్రీతి హుడా ఇంగ్లీష్ లో పరీక్ష రాయలేదు. అలాగే ఇంటర్వ్యూలోనూ అన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. పైగా ఆమె మొదటిసారే విజయం సాధించలేదు. ఫస్ట్ టైం పరీక్ష తప్పినప్పటికీ నమ్మకం కోల్పోకుండా మళ్ళీ ట్రై చేసింది. ప్రీతి రెండవ ప్రయత్నంలో ఐఏఎస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించింది.
సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవ్వాలంటే సీరియస్ నెస్ ముఖ్యం. సివిల్స్ కు సిద్ధమవుతున్నప్పుడు ప్రీతి చాలా సార్లు సినిమాలు చూసేదట. స్నేహితులతో కలిసి వాకింగ్ కు కూడా వెళ్ళేది. కానీ అది ఆమె దృష్టిని ఏమాత్రం ప్రభావితం చేయలేదు. ఐఏఎస్ అధికారి కావాలంటే అంత ఈజీ కాదు . కానీ పట్టుదల, నమ్మకం, ఆత్మ విశ్వాసం ముఖ్యం. అవన్నీ ఉన్నాయి కాబట్టే డ్రైవర్ కూతురు నేడు ఐఏఎస్ ఆఫీసర్ అయ్యింది.