ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో వేడి గాలులతో ప్రజలు అల్లాడిపోతున్నారు. బయటకు వెళ్లాలంటేనే భయపడతున్నారు. ఇళ్లలో కూడా కూలర్లు, ఏసీలపై ఆధారపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ప్రాంతంలోని గుడిలో దేవుడికి కూడా చల్లగా ఉండాలని ఏసీలు పెట్టించిన ఘటన ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బీహార్ రాష్ట్రంలోని గయా ప్రాంతంలోని ఓ ఆలయంలో దేవుళ్ల కోసం ఫ్యాన్లు, ఏసీలు అమర్చారు నిర్వాహకులు. ఈ విషయాన్ని గయలోని ఇస్కాన్ టెంపుల్ అధ్యక్షుడు జగదీష్ శ్యామ్ దాస్ తెలిపారు. ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయని, ప్రజలంతా ఫ్యాన్లు, ఏసీల ద్వారా ఊరట పొందడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన చెప్పారు.
“ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల సాయంతో ప్రజలు వేడి నుంచి తమను తాము రక్షించుకుంటున్నారు. అదే కోవలో ఆలోచించి గుడిలో దేవుళ్లకు, దేవతలకు ఏసీలు, ఫ్యాన్లు అమర్చాము. ఆలయంలో ప్రతిష్టించిన విగ్రహాల్లో రాధా దేవి, శ్రీకృష్ణుడు, జగన్నాథుడు ఉన్నారు.” అని ఆయన తెలిపారు.
అలాగే దేవుళ్లపై వాతావరణ పరిస్థితి ప్రభావం ఉండకపోవచ్చని.. కానీ వీటిని భక్తులు ఏర్పాటు చేశారని దాస్ తెలిపారు. ఇది భక్తుల భావోద్వేగానికి సంబంధించిన విషయమని వివరించారు. అయితే ఇది తెలిసిన చాలామంది ఆ ఆలయానికి వెళ్లి ఆ ఏర్పాట్లను చూస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.