ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఐటీ కంపెనీలు పొదుపు చర్యలు చేపట్టాయి. ఇప్పటికే పలు కంపెనీలు హైరింగ్ ప్రక్రియను ఆపివేశాయి. పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను మొదలు పెట్టాయి. ఈ క్రమంలో మరో టెక్ దిగ్గజ సంస్థ ఇంటెల్ మాత్రం వినూత్నంగా ఆలోచించింది.
సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలిగించే బదులు వారి వేతనాల్లో కోత విధిచాలని నిర్ణయించింది. కంపెనీలోని సీఈవో స్థాయి మొదలు కింది స్థాయి ఉద్యోగుల వరకు అందరి జీతాల్లో కోతలు విధిస్తోంది. ఈ నిబంధనను వెంటనే అమలులోకి తీసుకు రావాలని కంపెనీ భావిస్తోంది.
ఇంటెల్ కంపెనీ తాజా నిర్ణయం నేపథ్యంలో ఆ సంస్థ సీఈవో పాట్ గెల్ సింగర్ వేతనంలో 25 శాతం, ఎగ్జిక్యూటివ్ స్థాయి ఉద్యోగులకు 15 శాతం, సీనియర్ మేనేజర్లకు 10 శాతం, మధ్యస్థాయి మేనేజర్లకు 5 శాతం విధించనున్నారు. సంక్షోభం నేపథ్యంలో కంపెనీపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది.
ఈ నిర్ణయం సంస్థ భవిష్యత్తుకు దోహదం చేస్తుందని తాము భావిస్తున్నామని కంపెనీ పేర్కొంది. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో కంపెనీలన్నీ ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ క్రమంలో ఇంటెల్ నిర్ణయాన్ని ఐటీ నిపుణులు ప్రశంసిస్తున్నారు.