ప్రస్తుతం దేశవ్యాప్తంగా హిజాబ్ వివాదంపై చర్చ నడుస్తోంది. దానిని ఆసరాగా చేసుకొని దేశంలో అల్లర్లు సృష్టించేందుకు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐ చూస్తోందని నిఘావర్గాలు హెచ్చరించాయి. సిఖ్స్ ఫర్ జస్టిస్ సాయంతో భారత్ లో మరింత అశాంతి రాజేసేందుకు ఐఎస్ఐ సంస్థ రంగంలోకి దిగినట్టు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.
భారత్ వ్యతిరేక శక్తులు కొన్ని సిఖ్స్ ఫర్ జస్టిస్ చీఫ్ గురుపట్వనర్ సింగ్ పన్నుతో చేతులు కలపొచ్చని ఇంటెలిజెన్స్ వర్గాలు అనుమానిస్తున్నాయి. హిజాబ్ అంశాన్ని అడ్డుపెట్టుకుని ఉర్దూయిస్థాన్ కాన్సెప్ట్ ను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయవచ్చంటూ.. పోలీసులు, ఇతర దర్యాప్తు సంస్థలను ఇంటెలిజెన్స్ బ్యూరో హెచ్చరించింది.
రాజస్థాన్, ఢిల్లీ, యూపీ, బిహార్, వెస్ట్ బెంగాల్ లోని ప్రాంతాలతో ఉర్దూయిస్థాన్ ఏర్పాటుకు హిజాబ్ రెఫరెండమ్ ఉద్యమాన్ని ముస్లింలు ప్రారంభించాలంటూ సిఖ్స్ ఫర్ జస్టిస్ పిలుపునిచ్చినట్టు ఇంటెలిజెన్స్ బ్యూరో పేర్కొంది. ఇందుకు కావాల్సిన నిధులను సమీకరిస్తామంటూ హామీ ఇచ్చినట్టు తెలిపింది.
ముస్లిం విద్యార్థినులు ముఖానికి వస్త్రం ధరించి విద్యా సంస్థలకు రావడం కుదరదంటూ కర్నాటక రాష్ట్రం అభ్యంతరం చెప్పడం ఈ వివాదానికి దారి తీసింది. విద్యాలయాలు మత విశ్వాసాలు, ఆచారాలకు వేదిక కాకూడదని అలాంటి నిర్ణయానికి వచ్చినట్టు కర్నాటక సర్కారు వాదన. ఇది క్రమంగా ఒక్కో రాష్ట్రానికి విస్తరిస్తోంది. దీనిపై కర్నాటక హైకోర్టు విచారణ కూడా నిర్వహిస్తోంది.