– వెంకయ్యనాయుడుకు నో చెప్పిన వైసీపీ
– తమిళిసై కి నో చెప్పిన టీఆర్ఎస్
– అన్నాహజారే, శరద్ పవార్ పేర్లను ప్రతిపాదించిన కేసీఆర్
– మల్లగుల్లాలు పడుతున్న ఎన్‌డీఏ ప్రభుత్వం
– అగ్నిపరీక్షగా మారిన రాష్ట్రపతి ఎంపిక
– రాష్ట్రపతి సీటు ఎవర్ని వరిస్తోందని జోరందుకున్న చర్చ
తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న సమయంలో సిట్టింగ్ లో ఉన్న వాళ్లకే ఇస్తారా..? లేక వేరే వాళ్లను ఎంపిక చేస్తారా..? అనేది ఆసక్తిగా మారింది. ఇప్పుడు ఇదే విషయమై రాజకీయాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాష్ట్రపతిని ఎన్నుకోవడానికి అవసరమైన బలానికి 1.2 శాతం ఓట్లతో కూతవేటు దూరంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వం.. ఎవర్ని ఎంపిక చేయాలనే విషయంపై మల్లగుల్లాలు పడుతోంది. అందుకోసం ప్రాంతీయ పార్టీల మద్దతు దక్కుతుందనే ఆత్మవిశ్వాసంతో మోడీ ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే ఇప్పటికే వైసీపీ ద్వారా కానీ, బీజేడీ ద్వారా కానీ, అన్నాడీఎంకే ద్వారా కానీ కావల్సిన ఓటు బలాన్ని సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ నేపథ్యంలోనే వివిధ రాష్ట్రాలతో కేంద్రప్రభుత్వం చర్చలు జరిపింది. అందులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేరు ప్రస్థావనకు వచ్చింది. అయితే.. మూడు సంవత్సరాల నుంచి లోక్‌సభలో కానీ, రాజ్యసభలో కానీ.. ఎన్‌డీఏ ప్రభుత్వానికి బలం తగ్గినప్పుడల్లా ఆదుకుంటున్న వైసీపీ మాత్రం వెంకయ్యనాయుడైతే మద్దతిచ్చేది లేదని ఖరాఖండిగా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో కేంద్ర ప్రభుత్వం పరిస్థితి ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అన్నట్టుగా అయిందంటున్నారు విశ్లేషకులు.
ఈ నేపథ్యంలో మొదటి నుంచి తమకే మద్దతిస్తున్న వైసీపీ మాటను కాదనుకుండా గౌరవిద్దామా..? లేదంటే ఏదోటి చేసి వైసీపీని ఒప్పిద్దామా..? అనే చర్చలు బీజేపీలో నడుస్తున్నట్టు వార్తలొస్తున్నాయి. అయితే.. వెంకయ్యనాయుడి శరీరం బీజేపీలో, మనసు టీడీపీలో ఉంటుందని గతంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తే.. ఎన్ని ప్రయత్నాలు చేసిన వైసీపీ అంగీకరిస్తుందనే నమ్మకం కలగడంలేదంటున్నారు రాజకీయ పండితులు.
మరోవైపు తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కు కూడా అవకాశం ఉన్నప్పటికీ.. ఆమే పేరు కూడా ప్రస్థావనలో ఉండగా.. అందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం నో చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే.. కొన్నాళ్లుగా తెలంగాణ గవర్నర్ గా ఉన్న తమిళసైకి, అధికార టీఆర్ఎస్ కు మధ్య హోరాహోరీ యుద్ధం నడుస్తోంది. కొన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో గవర్నర్ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని టీఆర్ఎస్ ఆరోపిస్తుండగా.. తాజాగా ఆమె మహిళా దర్బార్ నిర్వహించారు.
ఈ సందర్భంలో రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని విమర్శలు చేశారు. తెలంగాణ మహిళల కోసం తన పోరాటం కొనసాగిస్తానని.. ఎదురు చెప్పేవాళ్లను తాను పట్టించుకోనని, తననెవరూ అడ్డుకోలేరని ప్రభుత్వాన్ని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. కాగా.. ఇప్పుడు ఆమెకు మద్దతుగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిలుస్తుందనే నమ్మకం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
కాగా.. రాష్ట్రంలో సంచలనం నమోదవుతుందని ప్రకటించిన కేసీఆర్ మాట రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక గురించేనని చర్చ రాష్ట్ర రాజకీయాల్లో జోరుగా చర్చనందుకుంది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ రెండు పేర్లను తెరమీదికి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. ఒకటి శరద్ పవార్ అయితే.. రెండవది అన్నాహజారే. ఇటు శరద్ పవార్ అయితే ప్రతిపక్షాలతోపాటు బీజేపీ పక్షాలు కూడా మద్దతిస్తాయనేది కేసీఆర్ యోచనగా తెలుస్తోంది. అయితే.. శరద్ పవార్ నుండి మాత్రం ఈ విషయంలో ఎలాంటి స్పందన లేదు. ఇక.. అన్నాహజారే విషయంలో బీజేపీ ఏం ఆలోచిస్తుందో అర్ధం కావడం లేదు. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ విడుదైన నేపథ్యంలో దేశ రాజకీయాలు ఎన్ని మలుపులు తిరుగుతాయనేది వేచి చూడాల్సిందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.