మునుగోడు శాసనసభ స్థానం ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నెల 14 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చని, 15న నామినేషన్లు పరిశీలిస్తామని ఎన్నికల సంఘం వెల్లడించింది. నామినేషన్ల ఉపసంహరణకు 17 వరకు గడువు ఉంటుందని తెలిపింది. నవంబర్ 3న పోలింగ్, 6న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
తొలిరోజు ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ప్రజా ఏక్తా పార్టీ నుంచి నాగరాజు, స్వతంత్ర అభ్యర్థిగా మారం వెంకటరెడ్డి నామినేషన్లు దాఖలు చేశారు. 40 మంది అభ్యర్థులు నామినేషన్ పత్రాలు తీసుకున్నారు. నామినేషన్ల పర్వం కూడా మొదలైన నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
నియోజకవర్గంలోకి ప్రవేశించే అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నిఘా ఏర్పాటు చేశారు. నిన్న మొన్నటి వరకు అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేసిన పోలీసులు ఇప్పుడు ప్రతీ వాహనాన్ని ఆపుతున్నారు. ఆర్టీసీ బస్సులు, ఆటోలను కూడా తనిఖీలు చేస్తున్నారు. మునుగోడు మండలం గూడపూరు వద్ద కారులో తరలిస్తున్న రూ.13 లక్షల రూపాయలను పోలీసులు సీజ్ చేశారు.
చండూరు మండలం బీమనపల్లికి చెందిన నరసింహ అనే వ్యక్తి టీఎస్07 జీవై 7383 అనే నెంబరు గల కారులో రూ.13 లక్షల నగదు తరలిస్తున్నాడు. హైదరాబాద్ లో ప్లాట్ అమ్మగా వచ్చిన డబ్బును, పండగకు సొంత ఇంటికి తీసుకువచ్చానని.. మళ్లీ ఆ డబ్బును హైదరాబాద్ కు తీసుకువెళుతున్నానని బాధితుడు తెలిపాడు. అయితే, సరైన ఆధారాలు లేవంటూ పోలీసులు సీజ్ చేశారు.