రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ వ్యాఖ్యలపై ఇంటర్ జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇంటర్ ఆన్ లైన్ వాల్యుయేషన్ లో గ్లోబరీన్ సంస్థకు ఇంకో పేరుతో అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. మూడు కోట్ల ముడుపులకు మారు పేరు సంస్థకు కాంట్రాక్టు ఇచ్చేందుకు డీల్ కుదుర్చుకున్నారని వ్యాఖ్యానించారు.
నవీన్ మిట్టల్ బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. ప్రాణం పోయినా వెనకడుగు వేయనన్నారు. గ్లోబరీన్ సంస్థకు క్లీన్ చిట్ ఇచ్చేందుకు మరో మూడు కోట్లు ఒప్పందం కుదుర్చుకున్నారన్నారు. గ్లోబరీన్ సంస్థ వల్ల ఒకప్పుడు 10 లక్షల మంది విద్యార్థులు ఆగమయ్యారని, 20 మందికిపైగా స్టూడెంట్స్ ఆత్మహత్యలు చేసుకున్నారని అన్నారు.
ఈ నెల 9 వరకు బిడ్ లకు చివరి గడువు ఉందని, ఆ కంపెనీ బిడ్ వేసిందా? లేదా అన్నది బయట పెట్టాలన్నారు. ఆరు కోట్ల రూపాయల ముడుపుల కోసం నవీన్ మిట్టల్ గ్లోబరీన్ కు అనుకూలంగా పని చేస్తున్నారని, గ్లోబరీన్ కు, కోయమ్ట్ సంస్థకు సంబంధం లేదని నిరూపించాలన్నారు.
గ్లోబరీన్ కు సీఈవోనే కోయమ్ట్ సీఈవో కూడా అని ఆయన తెలిపారు. నవీన్ మిట్టల్ నేను చెప్పినవి తప్పని కమీషనర్ కార్యాలయంలోని అమ్మవారి ఆలయం వద్ద ప్రమాణం చేయాలని ఆయన సవాల్ విసిరారు. నేను ప్రమాణం చేయడానికి సిద్ధమంటూ పేర్కొన్నారు మధుసూదన్ రెడ్డి.