ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాలపై వివాదం నడుస్తుండడంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అందరినీ పాస్ చేస్తున్నామని ప్రకటించింది. ఫెయిల్ అయిన స్టూడెంట్స్ అందరికీ మినిమం పాస్ మార్కులు 35 వేస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ తొందరపడి ఆత్మహత్య చేసుకోవద్దని సూచించారు మంత్రి. సెకండియర్ పరీక్షలు దగ్గర్లో ఉండడంతో.. ఎవరూ ఒత్తిడికి గురికావొద్దనే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు వివరించారామె.
ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. కొందరు విద్యార్థులు ఫెయిల్ అయ్యామన్న బాధతో ఆత్మహత్య చేసుకున్నారు. విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. ఈ చావులకు సర్కారే కారణమంటూ ఇంటర్ బోర్డును ముట్టడించాయి. విపక్షాలు సైతం ప్రభుత్వ, బోర్డు తీరును తప్పుబడుతూ ధర్నాలు నిర్వహించాయి. ఫస్టియర్ లో అందర్నీ పాస్ చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులు కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం అందరినీ పాస్ చేస్తున్నట్లు ప్రకటించింది.
అందర్ని పాస్ చేయడం ఇదే లాస్ట్ అని మంత్రి హెచ్చరించడం.. ఫలితాలపై ప్రభుత్వాన్ని, బోర్డును నిందించడం ఏంటని మాట్లాడడంపై అనేక విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు చనిపోయిన విద్యార్థుల కుటుంబాల పరిస్థితేంటి..? బాగా చదివే వాళ్లు కూడా ఫెయిల్ అయి చనిపోయారు.. ఇప్పుడు అందర్నీ పాస్ చేసినంత మాత్రాన ఆ ప్రాణాలు తిరిగొస్తాయా..? బోర్డు తప్పిదాలకు విద్యార్థులను బలి చేస్తారా? అంటూ మండిపడుతున్నారు తల్లిదండ్రులు.