గ్రామానికి చెందిన ఓ యువతి ఇంట్లో ఎవరికి చెప్పకుండా ఇల్లు వదిలి వెళ్లిపోయింది. అలా వెళ్లిన తెల్లారే ఊరి చెరువులో శవంగా తేలింది. దీనిని తెలుసుకున్న గ్రామస్థులు బాలికతో పరిచయం ఉన్నయువకుడే ఈ పని చేసి ఉంటాడాని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
దీంతో బాలిక మృతికి కారణమైన యువకుని ఇంటి మీదకు బాలిక బంధువులు, గ్రామస్థులు దాడి చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్లో జరిగింది.
ముత్యంపేట్కు చెందిన సగ్గిడి మేఘమాల(17) ఇంటి నుంచి కనిపించకుండా పోయి.. తెల్లారేసరికి గ్రామ సమీపంలోని పరికికుంట చెరువులో శవమై కనిపించింది. మృతురాలి తండ్రి గల్ఫ్‌లో ఉండగా ఈరోజు గ్రామానికి చేరుకున్నాడు. అయితే గ్రామానికే చెందిన యువకుడే చంపి చెరువులో పడేసి ఉంటాడని ఆరోపిస్తూ అతనిపై దాడి చేసేందుకు వెళ్లారు.
విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి యువకుడిని స్టేషన్‌కు తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. అనుమానిత యువకుడ్ని పీఎస్‌కు తరలించిన పోలీసులు గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.