కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ నేతృత్వంలోని ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ(ఐటీ) ప్యానెల్ కీలక సమావేశం నిర్వహించింది. టెలీ కమ్యూనికేషన్ అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనట్టు తెలుస్తోంది.
ముఖ్యంగా వాట్సాప్ ను ఉపయోగించి చేసే ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్టెడ్ కాల్స్ ను టెలిగ్రాఫ్ చట్టం కిందకు తీసుకు రావడం లేదా ఆ కాల్స్ ను బ్లాక్ చేసే అవకాశాలపై కమ్యూనికేషన్ అధికారులతో ఐటీ ప్యానెల్ చర్చించినట్టు సమాచారం.
ఈ సమావేశంలో ఐటీ ప్యానెల్ పలు ప్రశ్నలను లేవనెత్తినట్టు అధికార వర్గాలు తెలిపాయి. టెలిగ్రాఫ్ చట్టం, సోషల్ మీడియాకు సంబంధించిన అంశాలపై టెలిగ్రాఫ్ చట్టాలతో ఎలా వ్యవహరించవచ్చు అనే అంశాలపై అడిగి తెలుసుకున్నట్టు వెల్లడించాయి.
ప్రముఖ వ్యక్తులపై ప్రభుత్వం ఇజ్రాయెల్ స్పై వేర్ పెగాసెస్ ను ఉపయోగించిందంటూ వచ్చిన ఆరోపణలకు సంబంధించి కూడా ప్రశ్నలు సంధించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లను టెలిగ్రాఫ్ చట్టం కిందకు తీసుకు రావాలని యోచిస్తోందా లేదా అనే అంశాన్ని ప్యానెల్ అడిగినట్టు వివరించాయి.
ఇప్పటి వరకు టెలిగ్రాఫ్ చట్టం కింద ఇలా ఏవైనా సందేశాలను బ్లాక్ చేశారా, చేస్తే వాటికి సంబంధించిన మరిన్ని వివరాలను ఇవ్వాలన్ని ప్యానెల్ కోరినట్టు తెలిపాయి.
అయితే అలాంటి డేటాకు సంబంధించిన రికార్డులను తాము నిర్వహించడం లేదని, దీనికి సంబంధించి ఎలాంటి డేటా అందుబాటులో లేదని కమ్యూనికేషన్ అధికారులు చెప్పినట్టు చెప్పాయి.