– బీఆర్ఎస్ కు పేరు బలం లేదా?
– కేసీఆర్ కొత్త పార్టీకి ఆరంభంలోనే చిక్కులా?
– జాతీయ పార్టీపై పండితుల వాదనేంటి?
ఇంకొన్ని గంటల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన చేయనున్నారు. దీనికోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. పార్టీ పేరు భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) అనే ప్రచారం జరుగుతోంది. అయితే, దీనికి పేరు బలం సరిగ్గా లేదనేది కొందరు పండితుల వాదన. మామూలుగా కేసీఆర్ కు ముహూర్తాలపై ఎంత నమ్మకం ఉందో అందరికీ తెలుసు. ఏ పని మొదలు పెట్టాలనుకున్నా.. ముందుగా ప్రగతి భవన్ కు పండితులు రావాల్సిందే. ఇన్నేళ్ల నుంచి జరుగుతోంది అదే. కానీ, బీఆర్ఎస్ విషయంలో కేసీఆర్ ను తప్పుదోవ పట్టించారనే చర్చ సాగుతోంది.
బీఆర్ఎస్ అనే పేరులో బలం లేదని.. ఒకవేళ కేసీఆర్ ఇదే పేరును ప్రకటిస్తే గనక చిక్కులు తప్పవని హెచ్చరిస్తున్నారు కొందరు పండితులు. అదీగాక ముహూర్తం విషయంలో కూడా తప్పులు జరిగినట్లు చెబుతున్నారు. ఆయనను నమ్ముకున్నవారే ముంచేస్తున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం.. గురువారం ఉదయం 11 గంటలకు పార్టీ సర్వసభ్య సమావేశం జరగనుంది. దీనికి 283 మందికి పైగా నేతలను ఆహ్వానం అందింది. సమావేశంలో టీఆర్ఎస్ పేరు మార్చి జాతీయ పార్టీగా రూపాంతరం చేస్తూ తీర్మానం చేస్తారని సమాచారం. మధ్యాహ్నం ఒంటిగంట 19 నిమిషాలకు జాతీయ పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ ప్రకటన ఉంటుంది.
బలంగా ఉన్న బీజేపీని ఢీకొట్టేందుకు సిద్ధమైన కేసీఆర్ పండితులతో ముహూర్తాలు ఖరారు చేసుకున్నా.. అవి అంత మంచిగా లేవని కొందరి వాదన. బీఆర్ఎస్ పేరులో బలం లేదని దీనిపై పునరాలోచన చేసుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ పేరుపై ప్రత్యర్థులు వ్యంగ్యాస్త్రాలు విసురుతున్నారు. వైటీపీ అధ్యక్షురాలు షర్మిల.. బీఆర్ఎస్ అంటే బార్ అండ్ రెస్టారెంట్ పార్టీ అంటూ సెటైర్లు వేశారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగులు బలవన్మరణాలు చెందుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఏ మాత్రం పట్టింపులేదని విమర్శిస్తున్నారు.
ఇక.. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా బీఆర్ఎస్ పై తనదైన రీతిలో చురకలంటించారు. బీఆర్ఎస్ అంటే బీహార్ రాష్ట్ర సమితిగా అభివర్ణించారు. ఇది బీజేపీకి ప్రత్యామ్నాయం కాదని, ఆ పార్టీకి బీ టీమ్ అని విమర్శలు చేస్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పేరుతో రకరకాల పేర్లు వ్యంగ్యంగా సోషల్ మీడియాలోనూ పోస్ట్ అవుతున్నాయి. ఇంకోవైపు కొందరు పండితులు పేరు బలం కూడా సరిగ్గా లేదని చెబుతున్నారు. మరి.. కేసీఆర్ గురువారం ఎలాంటి ప్రకటన చేస్తారో చూడాలి.