శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గ్యాప్ లేకుండా ఈ సినిమా షెడ్యూల్స్ జరుగుతున్నాయి. పూణె, రాజమండ్రి, విశాఖపట్నం, ఢిల్లీ, హైదరాబాద్.. ఇలా రకరకాల లొకేషన్స్ లో బ్యాక్ టు బ్యాక్ షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్ పరుగులు పెడుతోంది.
మరోవైపు మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇలాంటి టైమ్ లో రామ్ చరణ్ సినిమాపై ఓ కొత్త చర్చ మొదలైంది. ఈ సినిమాకు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు. ఏ టైటిల్ పెట్టారనే ఊహాగానాలు కూడా తెరపైకి రాలేదు. కానీ టైటిల్ ను మాత్రం రేపే ఎనౌన్స్ చేస్తారంటూ కొత్త ప్రచారం మొదలైంది.
మరికొందరు మాత్రం శనివారం రోజున టైటిల్ ను ప్రకటిస్తారంటూ కథనాలు వండివార్చేస్తున్నారు. మొత్తమ్మీద ఈ వారంలోనే చరణ్-శంకర్ సినిమా టైటిల్ ప్రకటన ఉంటుందనేది ఆ గాసిప్స్ సారాంశం.
వీటిపై నిర్మాత దిల్ రాజు స్పందించకపోవడంతో పుకార్లు మరింత ఊపందుకున్నాయి. ఎఫ్3 ప్రమోషన్ లో భాగంగా మీడియాతో ఇంటరాక్ట్ అవుతున్న దిల్ రాజు, చరణ్ సినిమాపై మాత్రం స్పందించడం లేదు. దానికింకా టైమ్ ఉందని, అప్పుడు మాట్లాడదాం అంటూ దాటేస్తున్నాడు. కనీసం గాసిప్స్ పై కూడా రియాక్ట్ అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు.