ఆర్మూర్ ఎమ్మెల్యే హత్యకు కుట్ర కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఈ కేసులో ప్రసాద్ గౌడ్‌తో పాటు ఆయన భార్య లావణ్యపై పోలీసులు కేసు నమోదు చేసి పలు కోణాల్లో దర్యాప్తు జరుపుతున్నారు.
ఈ కేసులో నిందితుడు ప్రసాద్ గతంలో మావోయిస్టు సానుభూతి పరుడిగా ఉన్నారని పోలీసులు విచాణలో తేలింది. జీవన్ రెడ్డిని హత్య చేసేందుకు ప్రసాద్ కొన్ని నెలలుగా కుట్ర పన్నుతున్నాడని దర్యాప్తులో తేలింది.
ఈ మేరకు బేగంబజార్‌లో ఓ కత్తి, ఎయిర్పిస్టల్కు నిందితుడు కొనుగోలు చేశాడని పోలీసులు గుర్తించారు. కానీ ఆ తుపాకీలో మాత్రం తుటాలు లేవని తేలింది.
బంజారాహిల్స్‌లోని రోడ్డు నెంబర్ 12లో ఉన్న జీవన్ రెడ్డి నివాసానికి ఈ నెల ఒకటిన ప్రసాద్ వెళ్లాడు. రాత్రి 8గంటల సమయంలో కింద గదిలో అంగరక్షకులు భోజనం చేస్తున్న సమయంలో వారిని నిందితుడు కలిశాడు.
తాను ఎమ్మెల్యేను కలవడానికి వచ్చానని చెప్పడంతో మొదటి అంతస్తులో వేచి చూడాలని అతనికి గన్ మెన్లు చెప్పారు. కానీ అవేవి పట్టించుకోకుండా నేరుగా రెండో అంతస్తులోకి ప్రసాద్ వెళ్లాడు. అక్కడ ప్రసాద్ రాకను గమనించిన జీవన్‌రెడ్డి అతన్ని ప్రశ్నించాడు. పైకి ఎందుకు వచ్చావని, కిందికి వెళ్లాలని, తానే కిందకు వస్తానని సమాధానం చెప్పారు.
ఆ తర్వాత కిందికి వచ్చిన ఎమ్మల్యే జీవన్ తో మాట్లాడారు. అసలు ఎందుకు వచ్చావంటూ ప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీంతో తాను పెండింగ్‌లో ఉన్న బిల్లుల విషయమై వచ్చానని చెబుతూ ఆ విషయంపై ఎమ్మెల్యేతో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. మాటా మాటా పెరగడంతో ప్రసాద్ చెంపపై జీవన్‌రెడ్డి గట్టిగా కొట్టాడు. దీంతో ప్రతి దాడి చేయాలని ప్రసాద్ ప్రయత్నించాడు. కానీ అతన్ని ఎమ్మెల్యే వెంటనే వెనక్కి నెట్టేశాడు.
ఈ పరిణామంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. ప్రసాద్ ను భద్రతా సిబ్బది పట్టుకుని తనిఖీ చేయగా ప్రసాద్ జేబులో రెండు తుపాకులు, కత్తి లభించాయి. దీంతో వాటిని స్వాధీనం చేసుకొని బంజారాహిల్స్ పోలీసులకు భద్రతా సిబ్బంది సమాచారం ఇచ్చింది.
ఎమ్మెల్యే ఇంటికి చేరుకున్న పోలీసులు రాత్రి 9 గంటల సమయంలో ప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రసాద్ ను టాస్క్‌ఫోర్స్ కార్యాలయానికి తీసుకెళ్లి పోలీసులు ప్రశ్నించారు.
తూటాలు లేకుండా తుపాకీ పెట్టుకొని ఎమ్మెల్యే ఇంటికి ఎందుకెళ్లాడనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎమ్మెల్యేను హత్య చేసేందుకు ప్రసాద్ కొన్ని నెలలుగా కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ విషయంలో ప్రసాద్ కు అతని స్నేహితుడు సంపత్ కూడా సాయం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. నెల క్రితం జీవన్‌రెడ్డి ఢిల్లీ వెళ్లగా.. ఆ విషయం తెలుసుకుని ప్రసాద్ కూడా ఢిల్లీ వెళ్లినట్టుగా పోలీసులు గుర్తించారు.