తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ రోజు జరిగాయి. సమావేశాల సందర్బంగా అసెంబ్లీలో ఆసక్తికర సన్ని వేశాలు కనిపించాయి. ఎప్పుడూ ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటూ బిజీ బిజీగా వుండే అధికార ప్రతిపక్ష నేతలు దానికి భిన్నంగా ఈ రోజు కనించారు.
అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నేతలు ఒకరికొకరు ఆత్మీయంగా పలుకరించుకున్నారు. మంత్రి కేటీఆర్ బీజేపీ ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లి పలుకరించారు. ఎమ్మెల్యేలు ఈటల, రఘునందన్ రావు, రాజాసింగ్ దగ్గరకు వెళ్లి కాసేపు వారితో ముచ్చటించారు.
ఈటెల రాజేందర్‌తో కేటీఆర్ మాట్లాడుతూ… హుజురాబాద్‌లో నిర్వహించిన సమావేశానికి ఎందుకు హాజరు కాలేదని ఈటలను కేటీఆర్ అడిగారు. దానికి ఆయన బదులిస్తూ పిలిస్తే హాజరయ్యే వాడినని ఆయన అన్నారు. అదే సమయంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అక్కడకు వచ్చారు.
తనను కూడా అధికారిక కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన కేటీఆర్ దృష్టికి తీసుకు వెళ్లారు. దీంతో కేటీఆర్ నవ్వి ఊరుకున్నారు. మరోవైపు మంత్రి కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మధ్య ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. సమావేశాలకు రాజాసింగ్ కాషాయ రంగు చొక్కాతో వచ్చారు.
కాషాయ రంగు తన కళ్లకు గుచ్చుకుంటోందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రంగంటే తనకు ఇష్టం ఉండదన్నారు. దీనిపై రాజాసింగ్ రిప్లై ఇస్తూ భవిష్యత్‌లో మీరు కూడా కాషాయ రంగు చొక్కా వేసుకోవచ్చేమోనని ఆయన సరదాగా అన్నారు. గవర్నర్ స్పీచ్‌కు ముందు శాసనసభలో ఈ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది.