ఆర్టీసీ సమ్మె, కార్మికుల సమ్మెలపై తొలిసారిగా గవర్నర్ తమిళిసై స్పందించారు. ఇప్పటి వరకు కార్మికులు, వివిధ పార్టీల విజ్ఙప్తులు మాత్రమే స్వీకరించిన గవర్నర్ నేరుగా రంగంలోకి దిగారు.
ఆర్టీసీ సమ్మెపై గవర్నర్ రవాణాశాఖ అధికారులను ఆరా తీశారు. దీంతో రవాణాశాఖ కార్యదర్శి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఆర్టీసీ సమ్మె తర్వాత పరిస్థితులు, కార్మికుల తొలగింపు… ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై గవర్నర్‌తో చర్చించినట్లు సమాచారం. త్వరలోనే రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ గవర్నర్‌తో భేటీ కాబోతున్నారు.
అయితే, గవర్నర్ తన డిల్లీ పర్యటన ముగించుకొని రాగానే… ఆర్టీసీ సమ్మెపై నేరుగా రంగంలోకి దిగటంతో టీఆరెఎస్ వర్గాలు, ప్రభుత్వ వర్గాలు పరిస్థితిని ఆసక్తిగా గమనిస్తున్నాయి. కేంద్రం దీనిపై డైరెక్షన్ ఇచ్చి ఉండవచ్చన్న అభిప్రాయం వినపడుతోంది.
ఓవైపు గవర్నర్ నేరుగా రంగంలోకి దిగటంతో… సీఎం కేసీఆర్ హుటాహుటిన రవాణా శాఖ అధికారులతో సమావేశమయ్యారు. ఇప్పటి వరకు ఏం చేశాం, ఇక ఏం చేయాలి… కోర్టులో ఉన్న అంశాలపై అధికారులతో చర్చించారు కేసీఆర్.
ఇలా ఓవైపు గవర్నర్, మరోవైపు కేసీఆర్ సీరీయస్‌గా రవాణా శాఖ అధికారులతో భేటీ అవుతుండటంతో… కార్మికులు, రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గవర్నర్ జోక్యం అనంతరం అయినా… సమ్మె సుఖాంతం అవుతుందో చూడాలి.