పలు రాష్ట్రాల్లో ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేయాలన్న బీజేపీ ప్రయత్నాలకు వ్యతిరేకంగా జమైత్ ఉలామా ఇ హిందూ(జేయూహెచ్) ఓ తీర్మానాన్ని చేసింది. ఇస్లాం చట్టాల్లో జోక్యం చేసుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నట్టుగా జేయూహెచ్ తెలిపింది.
జ్ఞాన్‌వాపి మసీదు, షాహీ ఈద్గాకు వ్యతిరేకంగా పాత వివాదాలను లేవనెత్తుతున్న మత శక్తుల ద్వారా విభజన రాజకీయాలకు బీజేపీ పాల్పడుతోందని జేయూహెచ్ ఆరోపించింది.
యూపీలోని థియోబంధ్ లో ఏర్పాటు చేసిన ముస్లిం సంఘాల సమావేశం రెండో రోజున ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించారు. వివాహం, విడాకులు, వారసత్వం మొదలైన సమస్యలపై ఇస్లాం చట్టాలను వ్యక్తులు కానీ, సమాజం, సంఘం గానీ చేయలేదని తెలిపింది.
ఆ చట్టాలన్ని మత గ్రంథాల నుంచి వచ్చాయని పేర్కొంది. ఖురాన్, హదీస్‌లో పేర్కొన్న నమాజ్, రోజా, హజ్ మొదలైన వాటిలాగే అవి మన మతపరమైన నిర్దేశాల్లో భాగమేనని తెలిపింది. అందువల్ల, వాటిలో మార్పులు తీసుకు రావాలని చూడటం, వాటిని పాటించకుండా ఆపడానికి ప్రయత్నించడం అనేది ఇస్లాంలో జోక్యం చేసుకోవడమేని పేర్కొంది. రాజ్యాంగంలోని సెక్షన్ 25 ప్రకారం వచ్చిన హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని పేర్కొంది.
ముస్లిం పర్సనల్ లాకు ముగింపు పలికే ఉద్దేశ్యంతో యూసీసీని అమలు చేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తోందని జేహెచ్ యూ చెప్పింది. రాజ్యాంగం ఇచ్చిన హామీలను విస్మరించడం ద్వారా రాజ్యాంగ నిజమైన స్ఫూర్తిని బీజేపీ విస్మరిస్తోందని విమర్శించింది. ఇస్లామిక్ చట్టాల్లో ఎలాంటి జోక్యాన్ని ఏ ముస్లిం కూడా అంగీకరించరని జేహెచ్ యూ స్పష్టం చేసింది.