భూపాలపల్లి జిల్లాలో పర్యటించారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. ఆమెతోపాటు మంత్రి సత్యవతి రాథోడ్ కూడా ఉన్నారు. అయితే.. నూతనంగా నిర్మించిన తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం భవనాన్ని ప్రారంభించారు కవిత. కానీ, ఆమెకు ఊహించని సంఘటన ఎదురైంది. కవిత ముందే బీఆర్ఎస్ శ్రేణులు రెండు వర్గాలుగా విడిపోయి పోటాపోటీ నినాదాలు చేశారు. దీంతో కవితకు కాసేపు ఏం జరుగుతుందో అర్థం కాలేదు.
తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కార్యాలయం ప్రారంభోత్సవంలో శిలాఫలకంపై ఎమ్మెల్సీ మధుసూదనాచారి పేరు లేదు. దీనిపై ఆయన వర్గీయులు ఒక్కసారిగా భగ్గుమన్నారు. ఎమ్మెల్యే ప్రొద్బలంతోనే శిలాఫలకంపై ఎమ్మెల్సీ పేరును చేర్చలేదని పేర్కొంటూ మండిపడ్డారు. చారీకి అనుకూలంగా నినాదాలు చేశారు. అదే సమయంలో ఎమ్మెల్యే గండ్ర అనుచరులు కూడా పోటాపోటీగా కేకలు పెట్టారు. దీంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇరు వర్గీయులు బల ప్రదర్శనకు దిగేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
ఈ పరిణామాలపై కవిత తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సమావేశం ముగిసేంత వరకు కూడా ఈ వర్గపోరు, ఉద్రిక్తత కొనసాగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడిన కవిత.. సింగరేణి కార్మికులకు వస్తున్న సౌకర్యాలు దేశంలోని కార్మికులకూ రావాలని ఆకాంక్షించారు. చంద్రబాబు విజన్ 20-20లో సింగరేణి ప్రైవేటీకరణకు ఆజ్యం పోశారన్న ఆమె.. సీఎం కేసీఆర్ డిపెండెంట్ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టుకు వెళ్లి అడ్డుకున్నారని ఆరోపించారు. సింగరేణి కార్మికులను కాపాడుకుంటామన్న కవిత.. కోల్ ఇండియా కన్నా సింగరేణి కార్మికులకు ఎక్కువ వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు.
ఇక ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని సత్యవతి రాథోడ్ తో కలిసి కవిత సందర్శించారు. రుద్రేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. యునెస్కో గుర్తింపు పొందిన ఆలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్ లో రామప్ప దేవాలయాన్ని బీఆర్‌ఎస్ ప్రభుత్వం మరింత అభివృద్ధి చేస్తుందని వెల్లడించారు.
ములుగు జిల్లాలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని, అయినా ఎలాంటి స్పందనా లేదని మండిపడ్డారు కవిత. వర్సిటీ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భూమి కేటాయించిందని… మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలని కోరినప్పటికీ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వంలో నాలుగు సార్లు మేడారం జాతరకు రూ.100 కోట్లు ఇచ్చామన్నారు. గిరిజన బిడ్డల కష్టం చూసిన వ్యక్తి కేసీఆర్ అని, అందుకే ములుగును జిల్లాగా చేశారని గుర్తు చేశారు కవిత.